బుమ్రా ది గ్రేట్.. నువ్వు మగాడివిరా బుజ్జి

భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల హవా మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి... ఉపఖండపు పిచ్ లు ఎక్కువగా స్పిన్ కే అనుకూలిస్తుంటాయి... అందుకే స్పిన్నర్లు వచ్చినంత ఎక్కువగా మన దేశం నుంచి ఫాస్ట్ బౌలర్లు పెద్దగా రారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 09:14 PMLast Updated on: Dec 30, 2024 | 9:14 PM

Bumrah Domination In Australia Pitches

భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల హవా మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి… ఉపఖండపు పిచ్ లు ఎక్కువగా స్పిన్ కే అనుకూలిస్తుంటాయి… అందుకే స్పిన్నర్లు వచ్చినంత ఎక్కువగా మన దేశం నుంచి ఫాస్ట్ బౌలర్లు పెద్దగా రారు.. కొందరు వచ్చినా ఫిట్ నెస్ సమస్యలు గాయాలతో ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేరు.. సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు తరచుగా గాయాలు వెంటాడుతుంటాయి.. గాయాల నుంచి కోలుకుని మళ్ళీ రీఎంట్రీలో రాణించడం పెద్ద సవాల్…ఈ విషయంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తోపు అనే చెప్పాలి. పదునైన యార్కర్లు, తూటాల్లాంటి బౌన్సర్లు, రాకాసి స్వింగర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తుంటాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోలేక స్టార్ బ్యాటర్లు సైతం తోకముడిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కెరీర్ ఆరంభంలో ఎలాంటి బౌలింగ్ తో అదరగొట్టాడో ఇప్పటికీ అదే లైన్ అండ్ లెంగ్త్ , పదునైన పేస్ తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా టూర్ లో అతని బౌలింగ్ చూస్తేనే బుమ్రా పేస్ పవర్ అర్థం చేసుకోవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యంత నిలకడగా రాణిస్తూ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా ఓవైపు టీమిండియా తడబాటు కొనసాగుతున్నా.. బుమ్రా మాత్రం సెన్సేషనల్ బౌలింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు.ఇప్పటికే టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయి అందుకున్న భారత బౌలర్‌గా రికార్డ్ సాధించిన బుమ్రా.. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ సిరీస్‌లో ఇప్పటికే 30 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇరు జట్లలో మరే బౌలర్ కూడా బుమ్రాకు దగ్గరలో కూడా లేరు. కనీసం 17 వికెట్లు కూడా తీయలేకపోయారు.

సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాదేశాల్లో బుమ్రాకు ఇది 9వ ఫైవ్ వికెట్ హాల్. ఈ సిరీస్‌లో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. అడిలైడ్‌లో 4 వికెట్లు తీసాడు. గబ్బా టెస్ట్‌లో 9 వికెట్లు తీసిన బుమ్రా.. తాజా మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద 2024లో బూమ్రా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 13 మ్యాచ్ లు ఆడి 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది మూడో బెస్ట్ యావరేజ్ గా నిలిచింది. అలాగే బాక్సింగ్ డే టెస్టుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బూమ్రాకు సమీపంలో కూడా ఎవ్వరూ లేరు. తనపై ఉన్న అంచనాలను ఎప్పుడూ వమ్ము చేయని బుమ్రా భారత క్రికెట్ కు దొరికిన కోహినూర్ డైమండ్ అంటూ గతంలోనే భారత మాజీలు ప్రశంసించారు. వారి అభిప్రాయం 100కు 200 శాతం సరైనదేనని మరోసారి ఈ స్టార్ పేసర్ నిరూపించాడు.