కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై, కొత్త కెప్టెన్ గా అతనేనా ?
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆప్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైన నేపథ్యంలో కెప్టెన్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆప్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైన నేపథ్యంలో కెప్టెన్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించాడు.వైట్ బాల్ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. వన్డేలతో పాటు టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కెప్టెన్ గా తనకు చివరిదని వెల్లడించాడు. ప్రస్తుతం తనకు, జట్టుకు ఇదే సరైన నిర్ణయంగా చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బట్లర్ ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇంగ్లాండ్ విజయాల కోసం ప్లేయర్ గా తన వంతు సహకారం అందిస్తానంటూ వ్యాఖ్యానించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ బలమైన జట్టుగా అడుగుపెట్టింది. ఈ టోర్నీకి ముందు భారత్ లో వన్డే సిరీస్ లో 0-3తో వైట్ వాష్ పరాభవం ఎదుర్కొన్నా ఆ జట్టు మెరుగ్గానే కనిపించింది. కానీ టోర్నీలో ఆస్ట్రేలియాపై రికార్డు స్కోరు చేసినా ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో షాకింగ్ ఓటమి ఇంగ్లండ్ ఆశలు గల్లంతు చేసింది. వరుసగా రెండో ఓటములతో సెమీస్ రేసు నుంచి తప్పుకొంది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో శనివారం (మార్చి 1) ఇంగ్లండ్ తలపడనుంది. బట్లర్ కు కెప్టెన్ గా ఇదే ఆఖరి మ్యాచ్. ఇంకొకరు కెప్టెన్ గా వచ్చి కోచ్ తో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్టు బట్లర్ చెప్పాడు. కోచ్ గా మెక్ కలమ్ రాగానే ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యాననీ, అతనితో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్దామనుకున్నా అలా జరగలేదని చెప్పుకొచ్చాడు. ’
ఇయాన్ మోర్గాన్ రిటైరవగానే 2022 లో బట్లర్ ఇంగ్లండ్ వన్డే, టీ20 పగ్గాలు అందుకున్నాడు. అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ తర్వాత అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో ఫెయిలవుతూ వచ్చింది. 2023 వన్డే ప్రపంచకప్ లో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ గత 21 వన్డేల్లో 15 ఓడింది. ఓవరాల్ గా 43 వన్డేల్లో జట్టును నడిపించిన బట్లర్ 18 విజయాలే అందుకోగా.. 25 ఓటములు చవిచూశాడు. 51 టీ20ల్లో 26 విజయాలు, 22 ఓటములు చూశాడు. కాగా బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై చెప్పడంతో కొత్త సారథిగా ఎవరు ఎంపికవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న హ్యారీ బ్రూక్ కు ఇంగ్లాండ్ పగ్గాలు దక్కే అవకాశముంది. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ బ్రూక్ అద్భుతంగా రాణిస్తున్నాడు.