హై హై నాయకా కెప్టెన్ గా రోహిత్ రికార్డ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్ కు దూసుకొచ్చిన టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ ఆసీస్ ను చిత్తు చేసింది. తద్వారా ఐదోసారి ఫైనల్లో అడుగుడుపెట్టింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్ కు దూసుకొచ్చిన టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ ఆసీస్ ను చిత్తు చేసింది. తద్వారా ఐదోసారి ఫైనల్లో అడుగుడుపెట్టింది. ఇప్పుడు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచిన భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఇదిలా ఉంటే టీమిండియాను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. మరే ఆటగాడు కూడా ఇప్పటి వరకు నాలుగు ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా ఫైనల్ చేరలేదు.
రోహిత్ శర్మ సారథిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లోనూ ఆసీస్.. రోహిత్ సారథ్యంలోని టీమిండియాను ఓడించింది. గతేడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచింది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హిట్ మ్యాన్ కెప్టెన్సీలోనే ఫైనల్ చేరింది. దీంతో నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. అయితే అతని హయాంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లేదు. 2019-21 ఎడిషన్ నుంచే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మాత్రమే ఆడింది. వన్డే ప్రపంచకప్ 2019తో పాటు టీ20 ప్రపంచకప్ 2016లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోయింది.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో బ్యాటర్ గానూ రోహిత్ రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ శర్మ అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ శర్మకు ఇది 65వ సిక్స్. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న 64 సిక్స్‌ల రికార్డ్‌ను రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్ 49, డేవిడ్ మిల్లర్ 45, డేవిడ్ వార్నర్ 42, సౌరవ్ గంగూలీ 42 సిక్సర్లతో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 250 సిక్సర్లు బాదిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాటర్ల జాబితాలో ఇటీవలే రాహుల్ ద్రవిడ్ ను రోహిత్ శర్మ అధిగమించాడు. అలాగే వన్డేల్లో క్రిస్ గేల్ 331 సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించిన రోహిత్.. అఫ్రిది 351 సిక్స్‌ల రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు చేరువలో ఉన్నాడు.
.