ఐపీఎల్ మెగావేలం ఆ స్పిన్నర్లపై కన్నేసిన చెన్నై
ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. నలుగురు లేదా ఐదుగురికి మించి రిటెన్షన్ చేసుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో ఏ ప్లేయర్స్ ను తీసుకోవాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. తమకు బలహీనంగా ఉన్న విభాగాలను పటిష్టం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్ స్టేడియంలో ఆ జట్టుకు ప్రధాన బలం స్పిన్నర్లే.. ఈ సారి స్పిన్ విభాగాన్ని మరింత బలపరుచుకునేలా కీలక ఆటగాళ్ళను తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ను వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది. గతంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ ఎన్నో విజయాలను అందించాడు. మళ్ళీ యాశ్ ను వేలంలో తీసుకోవాలని చెన్నై చూస్తోంది.
అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కూడా వేలంలో ప్రయత్నించబోతోంది. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న వరుణ్ చక్రవర్తి గత సీజన్ లో అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్ లలో 21 వికెట్లు తీసాడు. వరుణ్ ను తీసుకుంటే తమ స్పిన్ కు అసలు తిరుగుండదనేది సీఎస్కే ఆలోచన. ఇక గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్పిన్నర్ సాయికిషోర్ పైనా చెన్నై ఫ్రాంచైజీ కన్నేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ గానూ అతని ఆటతీరు మెరుగవడంతో ఆల్ రౌండర్ గా ఉపయోగపడతాడని భావిస్తోంది. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ సాయికిషోర్ నిలకడగా రాణిస్తుండడంతో అతన్ని వేలంలో దక్కించుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.