Virat Kohili: యూనివర్సల్ భాయ్ జాన్.. విండీస్ లో విరాట్
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి స్నేహితులకు కొదవే లేదు. అయితే కరీబియన్ దీవుల్లో మాత్రం తనకు స్పెషల్ ఫ్రెండ్ ఉన్నాడని విరాట్ వెల్లడించాడు. వెస్టిండీస్ పర్యటనకు వచ్చామంటే చాలు అతడిని కలవాల్సిందే.
జట్టు సభ్యులనంతా తన ఇంటికి ఆహ్వానించే నా ఫ్రెండ్ మనసు చాలా పెద్దది. అందరితో సరదాగా కలిసిపోయే అతడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని పదే పదే చేప్తుంటాడు’.. ఇవి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు. అంతలా చెప్పుకొస్తున్న ఆ మిత్రుడెవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుందిగా. అదేనండీ.. తనను తాను యూనివర్సల్ బాస్‌గా ప్రకటించిన విండీస్ అరవీర భయంకర వీరుడు క్రిస్ గేల్. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు ప్రస్తుతం వెస్టిండీస్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి కరీబియన్లతో తొలి టెస్టు ఆడనుంది.
ఈ నేపథ్యంలో గేల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని విరాట్ కోహ్లీ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఈ పర్యటన ముగిసే లోపు క్రిస్ గేల్‌ను కలుస్తానని విరాట్ వెల్లడించాడు. అతడు జమైకాలో ఉంటే.. భారత ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానిస్తాడని కోహ్లీ చెప్పాడు. గేల్ ప్రస్తుతం సొంతగడ్డపైనే ఉండటంతో ఈ టూర్ లో భాగంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు అతడి ఇంటికి వెళ్లడం ఖాయమే అని విరాట్ అభిప్రాయపడ్డాడు. ఇక మైదానంలో ఎంతో జోష్ లో కనిపించే వీరిద్దరూ గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కలిసి ఆడిన విషయం తెలిసిందే. ‘అతడు సరదా మనిషి. అందరినీ గౌరవిస్తాడు.
విండీస్ పర్యటనలో తప్పక తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇసారి కూడా అతడు జమైకాలో ఉంటే అక్కడికి వెళ్తాం. అతడికి అభిమానులు ఎక్కువ. చివరిసారి కరీబియన్ పర్యటనకు వచ్చినప్పుడు గేల్ ఆతిథ్యం స్వీకరించాం’ అని కోహ్లీ తెలిపాడు. ఇక మైదానంలో తన ప్రత్యేకమైన హవభావాలతో పాటు.. డ్యాన్స్‌తో ఆకట్టుకునే గేల్ పొట్టి క్రికెట్‌లో విధ్వంసక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు.ఐపీఎల్లో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అశేష అభిమానులను సంపాదించుకున్న క్రిస్ గేల్‌కు విశ్వవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. జీవితాన్ని సరదాగా గడపడమే ముఖ్యమని బలంగా నమ్మే గేల్.. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతోనూ అంతే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాడు. పలువురు స్టార్ ఆటగాళ్ల ఐకానిక్ మూమెంట్స్‌ను అనుకరిస్తూ ఆకట్టుకుంటాడు.