అనామక ప్లేయర్లకు కోట్లు.. మైదానంలో మెరుస్తారా ?
ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్ళకు చక్కని వేదిక... వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి అవకాశం... మెగావేలంలో ఈ సారి చాలా మంది యువ ఆటగాళ్ళపై కోట్ల రూపాయల వర్షం కురిసింది.

ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్ళకు చక్కని వేదిక… వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి అవకాశం… మెగావేలంలో ఈ సారి చాలా మంది యువ ఆటగాళ్ళపై కోట్ల రూపాయల వర్షం కురిసింది. అనామక ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. దేశవాళీ క్రికెట్ లో వారి ప్రతిభ ఆధారంగా తమ తమ టీమ్స్ లోకి తీసుకున్నాయి. దీని కోసం భారీగానే వెచ్చించేందుకుకూడా ఫ్రాంచైజీలు వెనుకాడలేదు. కోట్ల రూపాయలకు అమ్ముడైన పలువురు యువ ఆటగాళ్ళపై భారీ అంచనాలే ఉన్నాయి. అన్ క్యాప్డ్ ఆటగాళ్ళలో నమన్ ధీర్ ఏకంగా 5.25 కోట్లు పలికాడు. ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంది. అలాగే నేహల్ వధేరాను పంజాబ్ 4.20 కోట్లకు , ,అబ్దుల్ సమద్ ను లక్నో 4.2 కోట్లకు , ప్రియాన్ష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ 3.80 కోట్లకు కొనుగోలు చేశాయి. వీరితో పాటు అశుతోష్ శర్మ, అభినవ్ మనోహర్, అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా భారీ ధర పలికారు. కోట్లు రూపాయలు పెట్టిన కొన్న వీరంతా ఎలా ఆడతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ముంబయికి గతేడాది ఆడిన ఆల్‌రౌండర్ నమన్ ధీర్, దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బ్యాట్ తోనూ, బాల్ తోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడాడు. ఇక 24 ఏళ్ల నేహల్ వధేరా గతేడాది ముంబయికి ఆడగా, ఈసారి తన సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అలాగే అబ్దుల్ సమద్ కు ఇప్పటికే ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ సిక్సర్లు బాదే సత్తా సమద్ సొంతం. ఈ యువ ఆటగాడు గతంలో సన్‌రైజర్స్ తరఫున పలు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు.
ప్రియాన్ష్ ఆర్య ఈ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచే అవకాశం ఉంది. దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం ద్వారా ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. మ్యాచ్ స్వరూపాన్ని తన బ్యాటింగ్ తో మార్చేయగల సత్తా ఉన్నోడు. మరోవైపు యువ ఆటగాడు అశుతోష్ శర్మ 2023 ముస్తాక్ అలీ ట్రోఫీలో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించాడు. 11 బంతుల్లో అర్ధసెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈసారి కూడా అదే స్థాయిలో రాణిస్తే, త్వరలోనే టీమ్‌ఇండియాలోకి ఎంపిక కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ సీజన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన రసిఖ్ సలామ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు.25 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్‌ను మెగా వేలంలో 6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. గతేడాది దిల్లీ క్యాపిటల్స్ తరఫున 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసిన అతను, ఆసియా ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్‌లో యూఏఈపై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. సీఎస్కే తరుపున బరిలోకి దిగనున్న అన్షుల్ కాంబోజ్ పైనా అంచనాలున్నాయి. హరియాణాకు చెందిన పేసర్ అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేరళపై తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులిచ్చి 10 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికాడు. గత సీజన్‌లో ముంబయికి ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈసారి సీఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ గత రెండు సీజన్లలో కోల్‌కతా తరఫున ఆడాడు. 2023లో 11 మ్యాచుల్లో 10 వికెట్లు తీయగా, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే సత్తా ఉందని పలుసార్లు నిరూపించుకున్నాడు. ఈ సారి ఆర్సీబీ తరఫున అన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం సుయాశ్ కు దక్కనుంది. దీంతో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ఈ సీజన్ అతనికి గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.