ఇక అమ్మాయిల ధనాధన్ వుమెన్స్ ఐపీఎల్ కు కౌంట్ డౌన్
ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు... ఈ లీగ్ నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఎన్నో లీగ్స్ పుట్టుకొచ్చాయి. అదే సమయంలో మహిళా క్రికెటర్లకు సైతం బీసీసీఐ ఐపీఎల్ ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది.

ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు… ఈ లీగ్ నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఎన్నో లీగ్స్ పుట్టుకొచ్చాయి. అదే సమయంలో మహిళా క్రికెటర్లకు సైతం బీసీసీఐ ఐపీఎల్ ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. సీజన్ సీజన్ కూ క్రేజ్ పెరుగుతున్న వుమెన్ ఐపీఎల్ 2025 కు కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం నుంచే మహిళల ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. వడోదర వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆర్‌సీబీకి సారథ్యం వహిస్తుండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఆష్లీ గార్డ్‌నర్ గుజరాత్ జెయింట్స్‌కు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.
డబ్ల్యూపీఎల్‌లో మొత్తం ఐదు జట్లు డబుల్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. రెండు, మూడో స్థానంలో నిలిచిన జల్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.మొత్తం నాలుగు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. వడోదరలోని కోటాంబి స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియం, ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగబోతున్న బెంగళూరు.. మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ఉత్సాహంగా ఉంది. 2008 నుంచి బెంగళూరు ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ పురుషుల జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు. అయితే మహిళల విభాగంలో మాత్రం తొలిసారి బెంగళూరు విజేతగా నిలిపీ ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపింది. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ గెలిచింది. అయితే గత రెండు ఎడిషన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచింది. కాగా ఇదిలా ఉంటే బ్రాడ్ కాస్టింగ్ హక్కుల అమ్మకంలోనూ వుమెన్స్ ఐపీఎల్ రికార్డులు సృష్టించింది. బిడ్డింగ్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ నెట్‌వర్క్, అమెజాన్ ప్రైమ్, రిలయన్స్ వయాకామ్ 18 , ప్యాన్ కోడ్, టైమ్స్ ఇంటర్నెట్, గుగూల్, డిస్కవరీ వంటి బడా కంపెనీలు పోటీపడ్డాయి. చివరకు 951 కోట్ల భారీ మొత్తానికి రిలయన్స్ వయాకామ్ 18, ఉమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్ను దక్కించుకుంది. ప్రతీ ఏడాదీ మహిళల ఐపీఎల్ కు సైతం అభిమానుల క్రేజ్ పెరుగుతూ వస్తోంది. స్టేడియాలతో పాటు టీవీ వ్యూయర్ షిప్ లోనూ రికార్డులు నమోదవుతున్నాయి.