అంతా నా ఇష్టం మోనార్క్ లా మారిన గంభీర్
ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో మొదలుకాబోతోంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత జట్టులో కీలకమార్పులు చోటు చేసుకున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో మొదలుకాబోతోంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత జట్టులో కీలకమార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. అలాగే ఓపెనర్ జైశ్వాల్ ను తప్పించి వరుణ్ చక్రవర్తిని 15 మంది జాబితాలోకి తీసుకున్నారు. జైశ్వాల్ , మహ్మద్ సిరాజ్, శివమ్ దూబేలను నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ గా సెలక్ట్ చేశారు. అయితే జట్టు ఎంపికలో మార్పులపై విమర్శలు వస్తున్నాయి. బుమ్రా దూరమైతే అతని స్థానంలో అనుభవజ్ఞుడు మహమ్మద్ సిరాజ్ కు జట్టులో స్థానం దక్కాలి. కానీ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. సిరాజ్ ను కాదని రెండు వన్డేలు ఆడిన హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేస్తారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక స్క్వాడ్ లో జైశ్వాల్ ను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. గంభీర్ ఏకపక్షంగా, స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అతడు ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహించిన కేవలం కేకేఆర్ ప్లేయర్స్ ను మాత్రమే సెలెక్ట్ చేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
టీమిండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టిన రాణా.. రెండో వన్డేలో ఓ వికెట్ తీశాడు. అయితే అతడికి దుబాయ్ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో దుబాయ్ పిచ్‌లపై సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తాడని, అతడినే బుమ్రా స్థానంలో తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జైశ్వాల్ ను అసలు ఎందుకు ఎంపిక చేశారో ఎందుకు తప్పించారో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. దీంతో ఈ యువ ఓపెనర్ పై వేటు పడింది. జైశ్వాల్ ను తప్పిస్తే అతని స్థానంలో మరొక బ్యాటర్ ను సెలక్ట్ చేయాలి. అయితే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్ లో చేర్చారు. అసలు విషయం ఏంటంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కూడా ఐపీఎల్ లో గంభీర్ మెంటార్ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడినవారే. దీంతో తమ ప్లేయర్లకు కావాలనే అవకాశం ఇస్తున్నాడని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయితే పర్వాలేదు. ఒకవేళ ఈ నిర్ణయాలు బెడిసి కొడితే మాత్రం బీసీసీఐ అతన్ని సాగనంపే అవకాశముంది. తాజా పరిణామాల ప్రకారం చూస్తే జట్టు ఎంపికలో అంతా గంభీర్ ఇష్టంగానే నడుస్తోంది. సెలక్టర్ల కంటే కూడా గంభీర్ చెప్పిన ఆటగాళ్ళకే చోటు దక్కుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే జట్టు ఎంపికలో ఎప్పటికప్పుడు తన మాటే నెగ్గించుకుంటున్న గంభీర్ టీమిండియా మోనార్క్ లా తయారయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఛాంపియన్స్ ట్రోఫీతో గంభీర్ దాదాగిరీకి తెరపడుతుందో… లేక కంటిన్యూ అవుతుందో వేచి చూడాలి.