Cricket: శ్రేయాస్ అయ్యర్ కు సర్జరీ.. భారత్, కోల్ కతాలకు షాక్.!
ఐపీఎల్ 16వ సీజన్ కు ముందు ప్రతీ ఫ్రాంచైజీని ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్స్ గాయాలతో దూరమవగా.. ఆ జాబితా పెరుగుతూనే ఉంది. ఊహించినట్టుగానే టీమిండియా స్టార్ బ్యాటర్, కోల్ కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ మరో 5 నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.
దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు భారత్ కూ, ఐపీఎల్ సీజన్ లో కోల్ కతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిగినట్టైంది. వెన్నునొప్పి కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు కూడా ఆడని శ్రేయాస్.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా గాయం తీవ్రమవడంతో లండన్‌లో సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ జరగనుందని సమాచారం.ఈ సర్జరీ తర్వాత కనీసం ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్‌తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండదు.
అయితే అక్టోబరులో జరగనున్న వన్డే ప్రపంచకప్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో అతడు లేకుండా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే అవకాశం లేదు. గాయం కారణంగా శ్రేయాస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చినా.. వెన్ను నొప్పితో ఆ సిరీస్‌లో ఇబ్బంది పడ్డాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకుని చికిత్స తీసుకుంటున్నాడు. సర్జీరీ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ దూరమవడం భారత్ కు గట్టి ఎదురుదెబ్బే. ఇప్పటికే బూమ్రా లాంటి స్టార్ పేసర్, యాక్సిడెంట్ కారణంగా పంత్ లాంటి వికెట్ కీపర్ కూడా ఆడడం లేదు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ లేకపోవడం జట్టుకు ఇబ్బందే. అటు శ్రేయాస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ కు కూడా గట్టి షాకే. ఐపీఎల్ 2022 వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను కోల్ కతా 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్ గా కూడా నియమించింది. ఇప్పుడు 16వ సీజన్ కు అతను దూరమవడంతో షకీబుల్ హసన్ కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయి.