Olympics 2028: ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్.. మనవాళ్లకు బంగారు పతకాల పంట ఖాయమే..!

2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ నుంచి ఈ క్రీడలు ఒలింపిక్స్‌లో భాగమవుతాయి. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌గానే చెప్పాలి. అంతర్జాతీయంగా పేరున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరితే.. భారత్ సహా వివిధ దేశాలు పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2023 | 05:13 PMLast Updated on: Oct 16, 2023 | 5:13 PM

Cricket Officially Confirmed For La Olympics 2028

Olympics 2028: ఇటీవలే ఆసియా క్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెట్ ఇకపై ఒలింపిక్స్‌లో కూడా భాగం కానుంది. క్రికెట్ సహా వివిధ కొత్త క్రీడల్ని ఒలింపిక్స్‌లో ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. ఈ మేరకు జరిగిన తీర్మానానికి సోమవారం కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఇకపై క్రికెట్‌తోపాటు బేస్ బాల్- సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లక్రాస్( సిక్సస్), స్వ్కాష్‌ క్రీడలు కూడా ఒలింపిక్స్‌లో భాగమవుతాయి. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ నుంచి ఈ క్రీడలు ఒలింపిక్స్‌లో భాగమవుతాయి.

క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌గానే చెప్పాలి. అంతర్జాతీయంగా పేరున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరితే.. భారత్ సహా వివిధ దేశాలు పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ క్రీడాకారులు బంగారు పతకాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇండియన్ ప్లేయర్లు మొదటిసారే గోల్డ్ మెడల్స్ గెలవడం విశేషం. అందులోనూ మహిళల జట్టు, పురుషుల జట్టు.. రెండూ మెడల్స్ సాధించి, భారత సత్తా చాటాయి. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ చేరితే.. మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది. క్రికెట్‌తోపాటు మిగతా క్రీడల్ని ఒలింపిక్స్‌లో చేర్చే అంశంపై సోమవారం ఓటింగ్ జరిగింది. ముంబైలో జరిగిన ఓటింగ్‌లో 90 మంది ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 88 ఓట్లు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చాయి. రెండు ఓట్లు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. అయితే, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను టెస్ట్, వన్డే ఫార్మాట్‌లో కాకుండా.. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండటం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 1900 సంవత్సరం వరకు ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండేది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వల్ల ఐఓసీకి ఆదాయం కూడా పెరుగుతుంది. మ్యాచుల ప్రసార హక్కుల ద్వారా బోలెడంత ఆదాయం లభిస్తుంది.