Cricket: వరల్డ్ కప్ ఏ నగరాల్లో తెలుసా ? హైదరాబాద్ లోనూ మ్యాచ్ లు

వన్డే ప్రపంచకప్ కు ఈ సారి భారత్ ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్ లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పలు నగరాలను షార్ట్ లిస్ట్ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ ను ఊహించినట్టుగానే అహ్మాదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. మిగిలిన మ్యాచ్ ల ఆతిథ్య నగరాలపైనా ఐసీసీకి సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2023 | 03:00 PMLast Updated on: Mar 22, 2023 | 3:00 PM

Cricket World Cup In India

వన్డే ప్రపంచకప్ అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. దీని కోసం బీసీసీఐ 12 వేదికలను షార్ట్ లిస్ట్ చేసింది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబయిలలో మ్యాచ్ లు నిర్వహించనుంది. ఫైనల్ ను అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్ కే కేటాయించే అవకాశముంది. అలాగే టోర్నమెంట్ కంటే ముందు జరగనున్న వార్మప్ మ్యాచ్‌ల కోసం మరో 2,3 వేదికలను కూడా బీసీసీఐ సిద్ధం చేసినట్లు సమాచారం. వర్షం పడే అవకాశాలు, సకాలంలో ఫీల్డ్‌ను సిద్ధం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని వేదికలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఐసీసీ ఆమోదం తర్వాత వేదికలను అధికారికంగా ప్రకటించనుండగా.. అక్టోబర్, నవంబర్ లలో ఉండే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వేదికను ఫైనలైజ్ చేయనుంది.

సాధారణంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఒక ఏడాది ముందుగానే ఐసీసీ ప్రకటిస్తుంది. అయితే ఈ సారి మాత్రం భారత్ లో ఈ మెగా టోర్నీకి పన్ను మినహాయింపు విషయంలో నెలకొన్న సందిగ్థతతో పాటు పాకిస్థాన్ క్రికెటర్ల వీసాల మంజూరుపైనా క్లారిటీ లేకపోవడంతో ఆలస్యమైంది. ఇదిలా ఉంటే మొత్తం 10 జట్లు పాల్గొనే టోర్నీ 46 రోజుల పాటు 48 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. భారత్ 2011 వన్డే ప్రపంచకప్ కు కూడా ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని టీమిండియా ఈ సారి సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.