Suresh Raina: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సురేష్ రైనా.. తినాలంటే ఆ దేశం వెళ్లాల్సిందే

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటోన్న రైనా ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ స్టైల్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సురేష్‌ రైనా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 24, 2023 | 02:56 PMLast Updated on: Jun 24, 2023 | 2:56 PM

Cricketer Suresh Raina Opens Indian Restaurant In Amsterdam

Suresh Raina: టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లయింది. ముందుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను కొన్ని రోజుల పాటు ధనాధన్‌ లీగ్‌లో ఆడి అభిమానులను అలరించాడు. అయితే ఆ తర్వాత ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటోన్న రైనా ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ స్టైల్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సురేష్‌ రైనా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన రైనా ‘ఆమ్‌స్టర్‌డామ్‌లోని రైనా ఇండియన్ రెస్టారెంట్‌ను మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఎంత ఫుడ్‌ లవర్‌నో మీకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు ఇక్కడి భారతీయులకు, ఇటు స్థానికులకు భారతదేశంలోని వివిధ రకాల వంటకాలను పరిచయం చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా గతంలో సురేష్ రైనా భార్య ప్రియాంక ఆమ్‌స్టర్‌డామ్‌లో పని చేసింది.

ఇప్పుడు రైనా కూడా అక్కడే రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఈబిజినెస్‌‌కు ముందు రైనా.. బేబీ ఉత్పత్తులను విక్రయించే ‘మేట్’ అనే కంపెనీని కూడా ప్రారంభించాడు. దీనితో పాటు ‘సాహికాయిన్’ అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాడు. కాగా భారత మాజీ కెప్టెన్ ధోనీకి సన్నిహిత మిత్రుడు అయిన రైనా, ధోని క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటలకే ఆగస్ట్ 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగిన రైనా.. సెప్టెంబర్ 2022లో మెగా టోర్నీకి కూడా గుడ్‌బై చెప్పాడు. తాజాగా లంక ప్రీమియర్ ఆడేందుకు రైనా తన పేరును రిజిష్టర్‌ చేసుకున్నాడు. అయితే ఆటగాళ్ల వేలంలో రైనా పేరు ప్రస్తావించలేదు.