డౌట్ లేదు.. టైటిల్ మనదే ఛాంపియన్స్ ట్రోఫీపై ధావన్
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8 టీమ్స్ తలపడుతున్న ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8 టీమ్స్ తలపడుతున్న ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి. తొలి మ్యాచ్ లో టీమిండియా బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. అటు పాక్ ను న్యూజిలాండ్ నిలువరించింది. టైటిల్ రేసులో ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ కూడా ఫేవరెట్స్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీపై తన అంచనాను వెల్లడించాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరో ధావన్ చెప్పేశాడు. టోర్నీలో మేటి జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతూనే అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న భారత్ కే టైటిల్ గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ధావన్ జోస్యం చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా గబ్బర్ తన ఇన్ స్టా పోస్టులో వెల్లడించాడు.
బుమ్రా స్థానంలో టీమిండియాలోకి వచ్చిన పేస్ సంచలనం హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోపీలో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తాడని ధావన్ అంచనా వేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే అరంగేట్రంతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా..దుబాయ్ లో భారత్ కు అవసరమైన వికెట్లు తీసి పెడతాడని ధావన్ జోస్యం చెప్పాడు. హర్షిత్ రాణా రాక జట్టుకు ఎంతో మేలు చేస్తుందన్నాడు. అతనికి ఇది బ్రేక్ అవుట్ టోర్నీ అవుతుందన్నాడు. సవాళ్లను స్వీకరించే మనస్తత్వం కలిగిన రాణా.. ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. కాబట్టి అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఖచ్చితంగా అనుకుంటున్నట్లు ధావన్ విశ్లేషించాడు. అటు షమీ పేస్ అనుభవం ఖచ్చితంగా ఇండియాకు ప్లస్సేనని అంచనా వేశాడు.
బంగ్లాదేశ్ పై అతను 5 వికెట్ల ప్రదర్శనతో ఫామ్ అందుకున్నాడని వ్యాఖ్యానించాడు. నిజానికి ఐసీసీ టోర్నీలంటే చాలు షమీ చెలరేగిపోతాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో అదిరిపోయే బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన షమీ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ ముందు వరకూ దాదాపు 15 నెలలు ఆటకు దూరమైన షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. అటు హర్షిత్ రాణా సైతం 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే మిగిలిన మ్యాచ్ లకు సంబంధించి బౌలింగ్ కాంబినేషన్ పై సస్పెన్స్ నెలకొంది. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లలో ఒకరికే చోటు దక్కనుంది. ఆదివారం పాక్ తో జరిగే మ్యాచ్ కు భారత తుది జట్టులో అర్షదీప్ కే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు.