ఛాన్స్ వస్తే ఆ ముగ్గురితో ఆడతా ధోనీ మనసులో మాట
భారత క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేక ప్రస్థానం... దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్... టెస్టుల్లో సైతం జట్టును నెంబర్ వన్ గా నిలిపిన నాయకుడు...

భారత క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేక ప్రస్థానం… దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్… టెస్టుల్లో సైతం జట్టును నెంబర్ వన్ గా నిలిపిన నాయకుడు… ఐసీసీ ప్రధాన ట్రోఫీలన్నింటినీ గెలుచుకున్న భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ ఒక్కడే.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్న ధోనీ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్యూలో పాల్గొన్నాడు. పాడ్ కాస్ట్ లో ధోనిని భారత క్రికెట్ గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. తన తరంలో ఎంఎస్ ధోని ఎవరితో ఆడాలనుకుంటున్నాడు.. భారతీయ ఆటగాడితోనా లేదా విదేశీ ఆటగాడితోనా అన్న ప్రశ్నకు ధోనీ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీతో ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
వీరూ పా ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడనీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుందన్నాడు. అలాంటప్పుడు ఆడడం కష్టమనీ, ఆ పరిస్థితుల్లో ఏ రీతిలో ఆడాలో నిర్ణయించుకోవడం అంత సులభం కాదన్నాడు. ఆ సమయాల్లోనూ ఈ ఆటగాళ్లు ప్రదర్శన మనమంతా చూశామన్న ధోనీ అప్పుడు వీరూ పా, దాదా ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని ధోనీ చెప్పుకొచ్చాడు. వీరంతా ఎవరికి వారే అద్భుతమైన ఆటగాళ్ళనీ, ప్రతీ ఒక్కరు భారత క్రికెట్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించారన్నాడు. ఇదిలా ఉంటే డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై ధోనీ ప్రశంసలు కురిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ధోనీ గుర్తు చేసుకున్నాడు. నాడు యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్ల గురించి ప్రస్తావించాడు. అందరు ఆటగాళ్లూ తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనంటూ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ధోనీ అనుకున్నంతగా రాణించలేకపోతున్నాడు. వికెట్ల వెనుక అద్భుతమైన కీపింగ్ తో అదరగొడుతున్నా… బ్యాటింగ్ లో మాత్రం ఆలస్యంగా వస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పుడూ ఆరు లేదా ఏడో స్థానంలో వచ్చే ధోనీ ఇప్పుడు 8 లేదా, తొమ్మిది స్థానాల్లో దిగుతున్నాడు. మోకాలికి సర్జరీ జరగడంతో మునుపటిలా భారీ షాట్లు కొట్టలేకపోతున్నాడు. కాగా తన రిటైర్మెంట్ పై వార్తలను ధోనీ కొట్టిపారేశాడుయ మరోవైపు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చైన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.