కొత్త సీజన్ కు తలా రెడీ ,ధోనీని ఊరిస్తున్న రికార్డులివే
ఐపీఎల్ వస్తుందంటే చాలు కొందరు స్టార్ క్రికెటర్ల కోసమే అభిమానులు ఎదురుచూస్తుంటారు.. ఆ జాబితాలో ముందుండే పేరు మహేంద్రసింగ్ ధోనీ...

ఐపీఎల్ వస్తుందంటే చాలు కొందరు స్టార్ క్రికెటర్ల కోసమే అభిమానులు ఎదురుచూస్తుంటారు.. ఆ జాబితాలో ముందుండే పేరు మహేంద్రసింగ్ ధోనీ… చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి క్రేజ్ వచ్చిందంటే ధోనీ పాత్ర ఎంతో ఉంది.. చాలా ఏళ్ళుగా సీఎస్కేకే అంకితమైన మహేంద్రుడి బ్యాటింగ్ కోసం అభిమానులు ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తలా క్రీజులోకి వచ్చేందుకు ముందు బ్యాటర్లు ఔటవ్వాలని కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సారి కూడా ధోనీ ధనాధన్ మెరుపుల కోసం చెన్నై ఫ్యాన్స్ క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని పలు రికార్డులు కూడా ఊరిస్తున్నాయి.
ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ కీపర్ గా పేరుతెచ్చుకున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ స్టంపింగ్ చేస్తుంటాడు. అంత ఫాస్ట్‌గా గ్లోవ్స్ మూవ్ చేసే కీపర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీలో ధోని తన వికెట్ కీపింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ రికార్డ్ ధోని పేరిటే ఉంది. 264 మ్యాచుల్లో 190 క్యాచ్‌లు, 42 స్టంపింగ్‌లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరో 10 క్యాచ్‌లు పడితే, 200 క్యాచ్‌ల మైలురాయి చేరిన ఫస్ట్ వికెట్ కీపర్‌గా ధోని రికార్డ్ క్రియేట్ చేస్తాడు. 95 క్యాచ్‌లతో రిషబ్ పంత్ రెండో స్థానంలో ఉండటంతో.. ధోనిని చేరుకోవడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దీంతో కొన్ని ఎడిషన్ల పాటు అత్యధిక క్యాచ్‌ల రికార్డ్ ధోని పేరిటే ఉండనుంది.
ఎప్పుడు ఐపీఎల్ ఆడినా ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తుంటారు. ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపించే ఈ లెజెండరీ బ్యాటర్ మరికొన్ని ఓవర్లు ఉంటే సులువుగా ఫిఫ్టీ చేస్తాడని నమ్ముతున్నారు. అయితే, ధోని ఈ ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేస్తే.. ఆ ఘనత సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉంది. ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ 40 ఏళ్ల 262 రోజులు వయసులో ఫిఫ్టీ కొట్టాడు. ఈ సారి 43 ఏళ్ల వయసున్న ధోని ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొన్న నిషేధ కాలంలో వేరే జట్టుకు ఆడటాన్ని మినహాయిస్తే.. ఐపీఎల్ ఆరంభం నుంచి ధోని ఇదే జట్టులో కంటిన్యూ అవుతున్నాడు. మధ్యలో చెన్నైపై నిషేధం పడినప్పుడు రెండు సీజన్లు రైజింగ్ పూణే జెయింట్స్ తరపున తప్పిస్తే మిగిలి 15 సీజన్లలో చెన్నైకే ఆడాడు. సీఎస్కే తరఫున అత్యధిక పరుగుల వీరుడి రికార్డ్ ప్రస్తుతం చిన్న తలా సురేష్ రైనా పేరిట ఉంది. రైనా కన్నా ధోని కేవలం 18 పరుగులు వెనుకబడి ఉన్నాడు. దీంతో ఈ సీజన్‌లో ధోని మరో 18 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
ధోని ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్ లలో 5243 పరుగులు చేశాడు. ఇప్పుటివరకు ఐపీఎల్ లో ధోని బ్యాట్ నుంచి 24 అర్థ సెంచరీలు వచ్చాయి. వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో 152 క్యాచ్ లు, 24 రనౌట్లు, 42 స్టంపింగ్ లు తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. అత్యంత విజయవంతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న ముంబై ఇండియన్స్ తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది.