Jadeja vs CSK: రైనాకు పట్టిన గతే జడేజాకు? ధోనీ టీమ్‌ని వదిలేస్తేనే మేలు
చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికి ధోనీనే గుర్తొస్తాడు.. కానీ ధోనీ విజయాల వెనుకున్న రైనా కనపించడు. ఇప్పుడు జడేజా కూడా ఆ జట్టు అభిమానులకు భారమైనట్టున్నాడు. ఇక ధోనీ టీమ్‌ను జడేజా వదిలేస్తేనే మేలు! లేకపోతే రైనాకు పట్టిన గతే పట్టొచ్చు!
ధోనీ బ్యాటింగ్ చూడాలని ఆశ పడడంతో తప్పేలేదు..ఎందుకంటే మహేంద్రుడి కెరీర్ చివరి దశలో ఉంది. అయితే అతని బ్యాటింగ్ చూడాలని మిగిలిన ఆటగాళ్లను అవుట్ అవ్వమంటే ఎలా? ప్రస్తుతం సీజన్‌లో ధోనీ ఫ్యాన్స్ అతి లిమిట్ దాటిపోయింది. ఓవైపు ధోనీ ఏమో.. కొన్నిసార్లు 6వ వికెట్ పడితే కానీ క్రీజులోకి రాని పరిస్థితి. ఛేజింగ్‌లో అవసరం ఉన్నప్పుడు కూడా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావడంలేదు. మ్యాచ్ విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మాత్రం పలుమార్లు తనను తాను ప్రమోట్ చేసుకొని ముందు దిగాడు. అయితే ఇవన్ని ఆ జట్టు స్ట్రాటజీలో భాగాలు. ఎందుకు ధోనీ అలా చేశాడో అతి వాళ్ల మేనేజ్‌మెంట్ ఇష్టం. అయితే అసలు సమస్య ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి కాదు.. అతని ఫ్యాన్స్ మిగిలిన వాళ్లు అవుట్ అవ్వాలని కోరుకోవడంతో మొదలైంది. ఈ విషయంలో జడేజా చాలా హర్ట్ అయ్యాడని.. అతను ట్విట్టర్‌లో లైక్ చేసిన ఫోటో చూస్తే అర్థమవుతుంది.
ఎందుకు బాబు ఆ అరుపులు.. కొంచెం ఆగండి:
టెస్టు క్రికెట్‌లో సచిన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చేవాడు. రెండో వికెట్ పడగానే సచిన్ వస్తున్నాడని అభిమానులు ఎక్సైట్ అయ్యేవాళ్లు. హర్షాబోగ్లే లాంటి కామెంటేటర్లు సైతం ఇదే విషయాన్ని చాలా సార్లు బాక్స్‌లో ప్రస్తావించారు. అయితే అక్కడ అభిమానులు రెండో వికెట్ పడాలని కోరుకోలేదు. రెండో వికెట్ పడ్డాక గ్రౌండ్‌లోకి సచిన్ ఎంట్రీ ఇస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్లు,గోల చేసేవాళ్లు. అయితే ఐపీఎల్‌లో ధోనీ ఫ్యాన్స్ అలా కాదు. చెన్నై టీమ్ బ్యాటర్లు అవుట్ అవ్వాలని కోరుకోవడమే కాదు.. అవుట్ అవ్వమంటూ అరుస్తున్నారు. ఇదేం పైత్యమో అర్థంకాని దుస్థితి. అలా మిగిలిన వాళ్లని అవుట్ అవ్వమని కోరుకునే బదులు.. ధోనీనే బ్యాటింగ్‌లో ముందు దిగితే సరిపోతుంది కదా అన్న డౌట్ వస్తుంది. ఇదే విషయాన్ని జడేజా నేరుగా అభిమానులకు చెప్పలేకపోయాడు కానీ.. ట్విట్టర్‌లో మాత్రం సైలెంట్‌గా చురకలంటించాడు.
బయటపెట్టుకోలేని బాధ జడేజాది:
ధోనీ కంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో తాను ముందుకు వస్తే.. ఫ్యాన్స్ త్వరగా అవుట్ కావాలని కోరుకుంటారంటూ జడేజా చేసిన కామెంట్స్‌పై మహేంద్రుడు అభిమానులు డప్పు కొట్టుకున్నారు. అది మా ధోనీ అన్న రేంజ్ అంటూ బిల్డప్‌లు ఇచ్చుకున్నారు. అయితే జడేజా లోలోపల బాధ అనుభవిస్తున్నాడని.. చెన్నై కోసం ఈ సీజన్‌లోనే మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న జడేజాని చిన్నచూపు చూస్తున్నారని.. ఈ కష్టం ఎవరికి రాకూడదంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌ను జడేజా లైక్ కొట్టాడు. నిజానికి జడేజాతో చెన్నై సూపర్ కింగ్స్‌కు గతేడాది నుంచే విబేధాలున్నాయి. ఈ ఏడాది ధోనీ టీమ్ తరఫున ఆడతాడని కూడా ఎవరూ ఊహించలేదు. జడేజా కూడా పలుమార్లు సీఎస్కే మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినా ఈ ఏడాది చెన్నై టీమ్‌లోనే కొనసాగుతున్నాడు..ఇదంతా ఎందుకు జరిగిందోనన్నది అటు ఉంచితే.. గతేడాది కెప్టెన్సీ విషయంలో జడేజాకు అవమానం జరిగిందని..ఈ ఏడాది ఏమో ఫ్యాన్స్ చిరాకు తెప్పిస్తున్నారని జడ్డూ మద్దతుదారులు వాదిస్తున్నారు.
గతంలో రైనా.. నెక్ట్స్ జడేజా:
రైనా, ధోనీ ఫ్రెండ్‌షిప్ గురించి తెలియని వారుండరు. అంతర్జాతీయ ఫార్మెట్‌కు ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించిన వెంటనే తాను కూడా గుడ్‌బై చెబుతున్నాట్లు ప్రకటించాడు రైనా. అంతటి స్నేహం వారిద్దరిది. అయితే 2020 దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌లో ఈ ఇద్దరి మధ్య బంధానికి బీటలు వారాయి. రైనాకు ఇచ్చిన హోటల్ గది నచ్చలేదని, దీంతో చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడని, వారు సర్దుకుపోవాలని చెప్పడంతో రైనా అది నచ్చక ఐపీఎల్‌ను వీడి వచ్చేశాడని వార్తలు వచ్చాయి. రైనాకు అడిగిన గదిని కేటాయించని చెన్నై మేనేజ్‌మెంట్ ధోనీని మాత్రం స్పెషల్‌గా ట్రీట్ చేసింది.
ఇక 2022మెగా వేలంలో రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయలేదు. అసలు రైనా లేని చెన్నై టీమ్‌ను ఊహించుకోవడం కష్టం. దాదాపు ప్రతి సీజన్‌లోనూ 400కు పైగా పరుగులు చేసిన ఘనత రైనాది. రైనా లేకపోయి ఉంటే చెన్నైకి నాలుగు ట్రోఫీలు వచ్చి ఉండేవే కావు. అలాంటి రైనాను చెన్నై మేనేజ్‌మెంట్ అవమానించడం అభిమానులను బాధ పెట్టింది. ఇక రైనా తర్వాత ధోనీ విజయాల్లో కీలక పాత్ర పోషంచిన జడేజాతో సీఎస్కే యాజమాన్యానికి గతేడాదిగా కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ఇక మేనేజ్‌మెంట్ దగ్గర నుంచి ఎలాగో గుర్తింపు రాదన్న విషయం జడేజాకు ఎప్పుడో అర్థమైపోగా..తాజాగా ఫ్యాన్స్ కూడా తనని అవుట్ అవ్వాలని కోరుకుంటుండడం అతన్ని మరింత బాధ పెట్టినట్లుగా అతను ట్విట్టర్‌లో చేసిన లైక్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికైనా జడేజా సీఎస్కే మేనేజ్‌మెంట్‌ను వీడితే మంచిది.. లేకపోతే ఏదో ఒక రోజు రైనాకు పట్టిన గతే పట్టడం మాత్రం పక్కా.