Dhoni: ఒక్క రనౌట్ భారీ మూల్యం ధోని ఆటకు అభిమానుల బేజారు

సరిగ్గా నాలుగేండ్ల క్రితం.. ఇదే రోజు భారత అభిమానుల గుండె పగిలింది. కోటి ఆశలతో వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2023 | 03:00 PMLast Updated on: Jul 11, 2023 | 3:00 PM

Dhonis Run Out By New Zealand In The Semi Final Match Was A Day That No Sports Fan Could Digest

దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించిన మహేంద్రసింగ్‌ ధోనీ ఆ మ్యాచ్‌ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడమే టీమ్‌ఇండియా పరాజయానికి ప్రధాన కారణంగా పరిణమించింది. విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో భారీ అంచనాల మధ్య 2019 వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత క్రికెట్‌ జట్టు.. లీగ్‌ దశలో దుమ్మురేపింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇంకేముంది మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్‌ సొంతమైనట్లే అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో భారత జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడ్డ భారత్‌కు ఆ మ్యాచ్‌లో ముగ్గురు విలన్లు ఎదురయ్యారు.

మొదట వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌ డే కు వాయిదా పడగా.. ఆనక టాప్‌-3 ప్లేయర్లు తలా ఒక పరుగు చేసి పెవిలియన్‌ చేరారు. ఇంకేముందు మ్యాచ్‌ చేజారినట్లే అనుకుంటున్న సమయంలో జడేజా-ధోనీ భాగస్వామ్యం తిరిగి ఆశలు రేపగా.. మరీ నెమ్మదిగా ఆడిన ధోనీ.. భారీ షాట్లు కొట్టాల్సిన సమయంలో రనౌట్‌ రూపంలో వెనుదిరిగి అభిమానులను నిరుత్సాహ పరిచాడు. జులై 9-10న జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఈ స్కోరు చేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదనే అంతా భావించారు. అయితే వర్షం కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రపంచ క్రికెట్‌లో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఒకే వరల్డ్‌కప్‌లో 5 శతకాలు బాది అరుదైన ఘనత సాధించిన రోహిత్‌ శర్మతో మొదలుకొని.. ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవారు ఉండటంతో టీమ్‌ఇండియా విజయంపై ఎవరికీ సందేహాలు లేకపోయాయి. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఒక్క పరుగు చేసిన హిట్‌మ్యాన్‌ రెండో ఓవర్‌లో పెవిలియన్‌ చేరగా.. ఆ మరుసటి ఓవర్‌లో రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ సింగిల్‌ రన్‌కే డగౌట్‌ బాటపట్టాడు. నాలుగో ఓవర్‌ తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ వీరిని అనుసరించాడు. దీంతో టీమ్‌ఇండియా 5 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్‌రేట్‌ అంతకంతకూ పెరుగి పోతుండటంతో ఓవైపు ఒత్తిడితో నరాలు తెగుతున్నా.. మరో వైపు ధోనీ, జడ్డూ ఉన్నారులే అనే భరోసా కాస్త ఉపశమనాన్నిచ్చింది. అంచనాలకు తగ్గట్లే ఈ జంట ఒక్కో పరుగు జోడిస్తూ.. మ్యాచ్‌ను ముందుకు నడిపించింది. కీలక మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా.. బ్యాట్‌తో తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేశాడు.

బౌండ్రీలు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన జడ్డూ.. 39 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అయితే జడేజా ధాటిగా ఆడుతున్నా.. మరో ఎండ్‌ నుంచి ధోనీ వేగం పెంచలేకపోయాడు. జడేజా నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఫుల్‌ జోష్‌లో ఉంటే.. అప్పటి వరకు 65 బంతులాడిన ధోనీ 38 పరుగలే చేశాడు. అందులో ఒకే ఒక్క ఫోర్‌ ఉండటం గమనార్హం. భారత్‌ విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉండగా.. గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో జట్టును విజయతీరాలకు చేర్చిన ధోనీ క్రీజులో ఉండటంతో అభిమానులు మనదే విజయం అనే ధీమాతో ఉన్న సమయంలో కివీస్‌ ఏస్‌ పేసర్‌ బౌల్ట్‌ బారత్‌ను దెబ్బ కొట్టాడు. పరుగులు చేయాలనే ఒత్తిడిలో జడేజా.. విలియమ్సన్‌ చేతికి చిక్కాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 31కి చేరగా.. ఫెర్గూసన్‌ వేసిన 49వ ఓవర్‌ తొలి బంతికి ధోనీ సిక్సర్‌ బాదాడు.

అదే రేంజ్‌లో మరో రెండు, మూడు షాట్లు ఆడితే పని అయిపోతుందనుకుంటే.. మూడో బంతికి గప్టిల్‌ వేసిన సూపర్‌ త్రోకు ధోనీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వికెట్‌తోనే భారత్‌ విజయంపై ఆశలు వదులుకోగా.. ఆరంభంలో ధోనీ కాస్త వేగంగా ఆడి ఉన్నా.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. చివరకు భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఏదేమైనా.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో జట్టును క్లిష్ట స్థితిలో విడిచి పెవిలియన్‌ చేరుతున్న ధోనీ కళ్లలో చెమ్మ ప్రతి భారత క్రీడాభిమానిని కదిలించిందనేది మాత్రం వాస్తవం. దేశానికి ఎన్నో విజయాలు అందించిన ధోని అలా కంటి తడి పెట్టడంతో.. అప్పట్లో అతనిపై ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ.., కాలం చేసే గాయం మానదు కదా? ఇప్పటికీ ఆ మ్యాచ్ లో ధోని స్లో బ్యాటింగ్ ఎవ్వరూ జీర్ణించుకోలేరు.