చెన్నై బాల్ ట్యాంపరింగ్ చేసిందా ? బ్యాన్ చేయాలంటున్న ఫ్యాన్స్

ఐపీఎల్ 18వ సీజన్ రెండోరోజే వివాదం చెలరేగింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 05:10 PMLast Updated on: Mar 24, 2025 | 5:10 PM

Did Chennai Do Ball Tampering Fans Want To Ban Them

ఐపీఎల్ 18వ సీజన్ రెండోరోజే వివాదం చెలరేగింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు మండిపడుతున్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీఎస్కే పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ 29 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్‌ను పెవిలియన్‌కు పంపించాడు.

అయితే ఖలీల్ అహ్మద్ చేతిలో బంతి ఉన్నప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతని దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్‌కు ఇచ్చాడు. రుతురాజ్ కూడా దాన్ని వెంటనే జేబులో వేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని ముంబై, ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, బ్యాన్ చేయాలంటూ ఒకవర్గం అభిమానులు డిమాండ్ చేస్తుంటే.. సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని చెబుతున్నారు. వీడియోలో ఖలీల్ రుతురాజ్‌ చేతికి ఏమిచ్చాడు అనేది మాత్రం స్పష్టంగా కనిపించలేదు. దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు క్షుణ్నంగా పరిశీలించి అసలు నిజం చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఈమ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. రోహిత్ శర్మ,, విల్ జాక్స్, రాబిన్ లాంటి ప్లేయర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో… ముంబై ఇండియన్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విఘ్నేశ్ పుతూర్ 3 కీలక వికెట్లు తీసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర సీఎస్కేకు విజయాన్నందించారు. చెన్నై 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర 45 బంతులు 65 పరుగులు చేయగా… రుతురాజు గైక్వాడ్ 26 బంతుల్లో 53 రన్స్ తో దుమ్మురేపాడు. చివర్లో… రవీంద్ర జడేజా… మెరిశాడు.