ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..? రోహిత్ ను వదలని గవాస్కర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2025 | 07:30 PMLast Updated on: Jan 30, 2025 | 7:30 PM

Did Rohit Play Ranji With That Fear Gavaskar Did Not Leave Rohit

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు. సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ కి రోహిత్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లోనూ రాణించలేకపోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా రోహిత్ బాటలోనే పయనిస్తున్నాడు.

రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ పై ఎటాకింగ్ చేయాల‌నే రోహిత్‌, శ్రేయ‌స్‌ల నిర్ణ‌యాన్ని గవాస్కర్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు శార్దూల్ ఠాకూర్, త‌నుష్ కొటియ‌న్‌ల‌ను చూసి నేర్చుకోవాల‌ని హెచ్చరించాడు. పైగా టెస్టుల్లో దూకుడు పనికిరాదని, ఇలా టెస్టుల్లో దూకుడుగా ఆడటం ద్వారా భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.టెక్నిక్‌తో షాట్లు కొట్టాలి, అంతేకానీ ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాల‌ని అనుకోకూడదని ఇద్దరికీ చురకలంటించాడు. వాళ్ళ ఆటను చూస్తే దేశవాళీలో ఆడేందుకు ఇష్టపడినట్లు కనిపించలేదని, బీసీసీఐ కాంట్రాక్ట్‌ నుంచి తప్పిస్తుందనే భయంతోనే రంజీ ఆడిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్నాడు.

గ‌తంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నిరాక‌రించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లను సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల నుంచి బీసీసీఐ త‌ప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్, య‌శ‌స్వి జైస్వాల్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు కోల్పోకుండా ఉండేందుకు ఆడిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్నారు గవాస్కర్. అయితే సన్నీ వ్యాఖ్యలపై రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తనను కించపరిచేలా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో సన్నీపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేశాడట. గవాస్కర్‌ తనను అంతగా విమర్శించాల్సిన అవసరంలేదని, గవాస్కర్ కామెంట్స్ కారణంగా మరింత ఒత్తిడికి గురైనట్లు రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లో బీసీసీఐలో పనిచేసే ఓ అధికారి చెప్పాడు.