ఫ్లాప్ షో కంటిన్యూ సన్ రైజర్స్ కు ప్లేఆఫ్ ఛాన్సుందా ?

ఐపీఎల్ 18వ సీజన్ లో ఈ సారి దిమ్మతిరిగే ఫలితాలు వస్తున్నాయి. ఊహించని విధంగా అంచనాలు పెట్టుకున్న జట్లు బోల్తాపడుతుంటే... అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 09:20 PMLast Updated on: Apr 07, 2025 | 9:20 PM

Does The Flop Show Continue Does Sunrisers Have A Playoff Chance

ఐపీఎల్ 18వ సీజన్ లో ఈ సారి దిమ్మతిరిగే ఫలితాలు వస్తున్నాయి. ఊహించని విధంగా అంచనాలు పెట్టుకున్న జట్లు బోల్తాపడుతుంటే… అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోంది. తొలి మ్యాచ్ లో భారీస్కోరుతో అదరగొట్టిన సన్ రైజర్స్ తర్వాత వరుసగా నాలుగింటిలో చిత్తుగా ఓడింది. హాట్ ఫేవరేట్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్..పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసి భారీ విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి 4 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుస్థానంలో కొనసాగుతోంది.

లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు ఇంకా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. అప్పుడే 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఈ 9 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఓడినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

బ్యాటింగ్ వైఫల్యమే ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోర వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్‌.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది. పేలవ బ్యాటింగ్‌కు తోడు చెత్త బౌలింగ్‌ జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం.. అనుభవం కలిగిన మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్ తేలిపోతుండటం.. సిమర్జిత్ సింగ్, ఉనాద్కత్ వంటి బౌలర్ల నుంచి సహకారం అందకపోవడం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది.

బ్యాటర్లు చెలరేగితేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కు విజయాలు దక్కుతాయి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు సత్తా చాటాల్సి ఉంది. ఈ నలుగురు ఫామ్‌లోకి వస్తే మాత్రం ఇతర ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతోంది. భారీ స్కోర్లు నమోదు చేస్తే.. బౌలర్లు సైతం సత్తా చాటుేందుకు అవకాశముంటుంది. వీలైనంత త్వరగా సన్‌రైజర్స్ తమ తప్పిదాలను సరిదిద్దుకొని చెలరేగకుంటే మాత్రం ఈ సీజన్‌‌లో ఆరెంజ్ ఆర్మీ కథ ముగిసినట్టే.