ఆసీస్ కు దిమ్మతిరిగే షాక్ మెగాటోర్నీకి కెప్టెన్ డౌటే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాలే టైముంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. అయితే పలువురు కీలక ఆటగాళ్ళ గాయాలు ప్రతీ జట్టునూ టెన్షన్ పెడుతున్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాలే టైముంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. అయితే పలువురు కీలక ఆటగాళ్ళ గాయాలు ప్రతీ జట్టునూ టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్యాట్ కమిన్స్ దూరం కానున్నడాని సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ చెప్పాడు. గత కొంత కాలంగా కమిన్స్ చీలమండ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. టీమిండియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత ఈ గాయం మళ్లీ తిరగబెట్టింది. పైగా అదే సమయంలో కమిన్స్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా అతడు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కమిన్స్ స్థానంలో లంక సిరీస్‌కు స్టీవ్ స్మిత్ సారథిగా ఎంపికయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కమిన్స్ గాయం మళ్లీ తిరగబెట్టడం ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేసింది. అయితే అతడి నేతృత్వంలోనే ఆసీస్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్లీ అతడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చని.. ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ హింట్ ఇచ్చాడు. గాయం మానలేదని.. చాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడటం అనుమానమేనని స్వయంగా ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. కమిన్స్ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు కాబట్టి మెగా టోర్నీలో అతడు ఆడటం కష్టమేనని కోచ్ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. తమ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఉందన్నాడు. సీనియర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లో ఒకరు సారథిగా టీమ్‌ను ముందుండి నడిపించడం ఖాయమన్నాడు. గాయాలతో బాధపడుతున్న హేజల్‌వుడ్, మిచెల్ మార్ష్ కూడా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు
తాజాగా లంకతో జరిగే వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ బయలుదేరింది. అందులో పాట్ కమిన్స్ లేడు. స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ ఒకరిని ఎంపిక చేయాలని చర్చలు జరుగుతున్నట్టు మెక్ డొనాల్డ్ చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి వారిని సిద్ధం చేయాలని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు కీలక ఆటగాళ్ళు మెగాటోర్నీకి దూరం కావడం ఆసీస్ కు భారీ షాక్ గానే చెప్పాలి. ఇక ఆ జట్టు టైటిల్ రేసుకు దూరమైనట్టేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.