కలిసొచ్చిన దుబాయ్ ,మనకు మరో హోంగ్రౌండ్
ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్ కారణంగా భారత్ తన మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక దుబాయ్ లోనే ఆడుతోంది. ఒకే స్టేడియంలో ఆడడంతో పరిస్థితులను బాగా అలవాటు చేసుకుందంటూ విమర్శలు కూడా వచ్చాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్ కారణంగా భారత్ తన మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక దుబాయ్ లోనే ఆడుతోంది. ఒకే స్టేడియంలో ఆడడంతో పరిస్థితులను బాగా అలవాటు చేసుకుందంటూ విమర్శలు కూడా వచ్చాయి. కానీ టీమ్ లో సత్తా ఉంటే ఏ పిచ్ పై అయినా గెలవొచ్చని చాలా మంది విదేశీ మాజీ క్రికెటర్లు సైతం సపోర్ట్ చేశారు. భారత్ పాక్ లో ఆడినా దుబాయ్ పిచ్ లపై ఆడినా పెద్ద తేడా ఉండదనేది మన ఫ్యాన్స్ చెబుతున్న మాట. ఎందుకంటే టోర్నీలో ఆడిన అన్ని జట్లతో పోలిస్తే టీమిండియానే బలంగా ఉంది. ఇదిలా ఉంటే దుబాయ్ స్టేడియం భారత్ కు బాగా కలిసొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు హోంగ్రౌండ్ లో మారిపోయింది.
లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. ఇదే వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. ఇక్కడ టీమిండియాకు మెరుగైన రికార్డ్స్ ఉన్నాయి. దుబాయ్ గడ్డపై భారత్ ఇప్పటి వరకు 10 వన్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2018 ఆసియా కప్ సందర్భంగా అఫ్గాన్‌తో మ్యాచ్‌ను టై చేసుకుంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా భారత్ ఆసియాకప్‌తో కలిపి రెండు వన్డే సిరీస్‌లు ఆడింది. ఈ రెండింటిలోనూ విజయం సాధించింది.
తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను వరుసగా ఓడించింది. ఇదే జోరులో ఫైనల్లో న్యూజిలాండ్‌ను మరోసారి మట్టికరిపించడం ఖాయమని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించిన భారత్.. హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఒక్కోసారి విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్‌ను భారత స్పిన్నర్లు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. భారత బ్యాటర్లు ఈ పిచ్ కండిషన్స్ తగ్గట్లూ ఓపికగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. దాంతో భారత్ వరుస విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలయ్యాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పెద్ద ఇన్నింగ్సే బాకీ ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా ఔటవుతున్నాడు. ఫైనల్లోనైనా అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఫైనల్లో వీరిద్దరూ చెలరేగితే భారీ స్కోరుకు పునాది పడినట్టే. కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, మహమ్మద్ షమీ మరోసారి కీలకం కానున్నారు. లీగ్ స్టేజ్ లో కివీస్ పై గెలిచి ఉండడం భారత్ కు ప్లస్ పాయింట్. అదే సమయంలో న్యూజిలాండ్ ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సిందే. మొత్తం మీద భారత్ కు మరో హోంగ్రౌండ్ లో మారిన దుబాయ్ వేదికగా ఫైనల్లో మనోళ్ళు దుమ్మురేపాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.