ఈడెన్., చెపాక్.. ఇప్పుడు వాంఖడే కోటలు బద్దలుకొడుతున్న ఆర్సీబీ

ఐపీఎల్ లో ఎవరి హోంగ్రౌండ్ లో వారికి మంచి రికార్డులే ఉంటాయి.. కానీ ప్రత్యర్థి జట్ల సొంతగడ్డపై గెలిస్తే ఆ కిక్కే వేరు.. అది కూడా దశాబ్దం తర్వాత వేరే జట్ల హోంగ్రౌండ్స్ లో విజయం సాధిస్తే ఆ జట్టుకు అంతకంటే కావాల్సిందేముంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 03:55 PMLast Updated on: Apr 08, 2025 | 3:55 PM

Eden Chepauk Now Rcb Is Breaking The Wankhede Fortresses

ఐపీఎల్ లో ఎవరి హోంగ్రౌండ్ లో వారికి మంచి రికార్డులే ఉంటాయి.. కానీ ప్రత్యర్థి జట్ల సొంతగడ్డపై గెలిస్తే ఆ కిక్కే వేరు.. అది కూడా దశాబ్దం తర్వాత వేరే జట్ల హోంగ్రౌండ్స్ లో విజయం సాధిస్తే ఆ జట్టుకు అంతకంటే కావాల్సిందేముంటుంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదే కిక్కును ఆస్వాదిస్తుంది. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. అద్భుత విజయాలు సాధిస్తోంది. కొన్నేళ్లుగా గెలవని స్టేడియాల్లోనూ ఇప్పుడు విజయ ఢంకా మోగిస్తోంది. కొరకరాని కొయ్యలుగా ఉన్న జట్లను చిత్తుచేస్తూ.. వారి కంచు గోడలు బద్దలు కొడుతోంది. ఈ సీజన్ లో ఈడెన్ లో కేకేఆర్ ను, చెపాక్ లో చెన్నైను , వాంఖడేలో ముంబయిని ఓడించిన ఆర్సీబీ రికార్డు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025లో సొంతగడ్డపై ఓ మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ.. ప్రత్యర్థి స్టేడియాల్లో మాత్రం అదరగొడుతోంది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. ఆ తర్వాత చెపాక్ లో అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది. ఇప్పుడు వాంఖడేలో మరో అయిదు సార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఒకే ఐపీఎల్ సీజన్ లో ఈడెన్ లో కేకేఆర్ ను, చెపాక్ లో చెన్నైని, వాంఖడేలో ముంబయిని ఓడించిన రెండో టీమ్ గా ఆర్సీబీ రికార్డు క్రియేట్ చేసింది. 2012లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఈ మూడు జట్లను వాటి హోం గ్రౌండ్స్ లో ఓడించింది.

చెపాక్ లో ఆరంభ సీజన్ 2008లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించింది. ఆ తర్వాత 2025 వరకూ ఆ గ్రౌండ్ లో సీఎస్కేను ఓడించలేకపోయింది. కానీ ఈ సీజన్ లో సంచలన ప్రదర్శనతో చెపాక్ లో సీఎస్కేను మట్టికరిపించి 17 ఏళ్ల తర్వాత అక్కడ తొలి విజయాన్ని అందుకుంది. ఇక వాంఖడే విషయానికి వస్తే 2015 తర్వాత అక్కడ ముంబయి ఇండియన్స్ మరో విక్టరీ అందుకోలేకపోయింది. తాజాగా ముంబయిని చిత్తుచేసి 10 ఏళ్ల వెయిటింగ్ కు ముగింపు పలికింది.వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 2024 వరకు ఆర్సీబీ విజయం నమోదు చేయలేదు. కానీ ఐపీఎల్ 2025లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీతో ఆర్సీబీ అందరికీ షాకిచ్చింది. వాంఖడేలో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి ఫ్యాన్స్‌‌ను కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ముంబైపై 221 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఎంఐను 209 పరుగులకే కట్టడి చేసి 12 పరుగుల తేడాతో గెలిచింది. పదేళ్లుగా కలగానే మిగిలిపోయిన విజయాన్ని సాధించి ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఇచ్చింది.

ఈ ఏడాది ఆర్సీబీ సాధించిన ఈ రెండు గొప్ప విజయాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ఆర్సీబీ ఓడిన ఒకే ఒక్క మ్యాచ్ కూడా తమ సొంత స్టేడియం బెంగళూరులోనే. మిగతా మూడు మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థుల హోం గ్రౌండ్‌లో వాళ్లని చిత్తు చేసింది. నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ప్రతిసారీ బెంగళూరుకు మైనస్‌గా ఉండే బౌలింగ్ విభాగం ఈ సారి స్ట్రాంగ్‌గా మారింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా మ్యాచ్‌లను గెలుస్తున్నారు. దీంతో ఈ సాలా కప్ నమదే స్లోగన్ ఈ సారి నిజమయ్యేలా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.