మీ ఆట ఇలా అయిందేంట్రా ఇంగ్లాండ్ చెత్త రికార్డ్
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ జట్టు ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ జట్టు ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాపై కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును కూడా నమోదు చేసింది.నిజానికి క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించిన మొదటి ఐసీసీ టోర్నమెంట్ ఇదే. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి టోర్నమెంట్ లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించేది. కానీ ఈ సారి ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. అన్నింటికీ మించి ఆప్ఘనిస్తాన్ చేతిలో ఓటమి ఇంగ్లాండ్ కు మింగుడుపడడం లేదు. ఈ మ్యాచ్ తోనే ఇంగ్లీష్ టీమ్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి.
సీనియర్ బ్యాటర్లు, బౌలర్లు ఎవ్వరూ కూడా నిలకడగా రాణించకపోవడం దెబ్బతీసింది. భారత్ చేతిలో 3-0తో వైట్ వాష్ పరాభవం తర్వాత కాన్ఫిడెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన ఇంగ్లాండ్ ఆట మాత్రం మారలేదు. ఆర్చర్, మార్క్ వుడ్ లాంటి బౌలర్లుండి ఆసీస్ పై 350 ప్లస్ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో ఓటమితో జోస్ బట్లర్ కెప్టెన్సీ కూడా ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమి తర్వాత బట్లర్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. దక్షిణాఫ్రికాపై విజయంతో జోస్ బట్లర్ తన కెప్టెన్సీని ముగిస్తాడని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
పరిమిత ఓవర్లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోయిన జోస్.. ఆటగాడిగా కూడా దారుణంగా విఫలమయ్యాడు. బట్లర్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా నెలలైంది. ఇటీవల భారత్‌లో పర్యటనతో పాటు.. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బట్లర్ తేలిపోయాడు. 2022 జూన్‌లో బట్లర్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్ మోర్గాన్ నుంచి బట్లర్ బాధ్యతలు స్వీకరించాడు. జోస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఆ జట్టు దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీమ్ 34 వన్డేలు ఆడింది. అందులో 22 మ్యాచులలో ఓడిపోయింది. కేవలం 12 మ్యాచ్‌లలోనే గెలిచింది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో ఇంగ్లాండ్.. లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆడిన 17 వన్డేల్లో 13 మ్యాచ్‌లలో ఓడిపోయింది.