పరువు తీసావ్ కదా, సామి కోహ్లీ ఇదేం తీరు

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో జెంటిల్మెన్ లా వ్యవహరించేది చాలా కొద్ది మంది మాత్రమే... ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లయితే స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్... సొంతగడ్డపై ఏ జట్టుతోనైనా సిరీస్ ఆడుతున్నారంటే రెచ్చిపోతుంటారు... కానీ వారికి ధీటుగా స్పందించే విషయంలో భారత ఆటగాళ్ళు ముందుంటారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 01:34 PMLast Updated on: Dec 27, 2024 | 1:34 PM

Ex Cricketers Fire On Virat Kohli

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో జెంటిల్మెన్ లా వ్యవహరించేది చాలా కొద్ది మంది మాత్రమే… ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లయితే స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్… సొంతగడ్డపై ఏ జట్టుతోనైనా సిరీస్ ఆడుతున్నారంటే రెచ్చిపోతుంటారు… కానీ వారికి ధీటుగా స్పందించే విషయంలో భారత ఆటగాళ్ళు ముందుంటారు… అయితే ఈ సారి సీన్ రివర్సయింది…మైదానంలో దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే విరాట్ కోహ్లీ అదుపు తప్పాడు.. 19 ఏళ్ళ యువ క్రికెటర్ పట్ల అతను ప్రవర్తించిన తీరు భారత్ పరువు తీసింది… టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణించడం.. అది కూడా తొలి మ్యాచ్ లోనే ఒక స్పెషల్ ఇన్నింగ్స్ ఆడడం చాలా కొద్దిమందికే సాధ్యమవుతుంది… మెల్ బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఇలాంటి ఇన్నింగ్స్ తో అదరగొట్టేశాడు ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కొంటాస్…19 ఏళ్ళకే అరంగేట్రం చేయడమే కాదు భారత్ లాంటి టాప్ టీమ్ పై దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్ కు కూడా చుక్కలు చూపించాడు.

అయితే ఈ యువక్రికెటర్ విధ్వంసంతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. అదుపు తప్పి, హద్దు మీరి ప్రవర్తించాడు. మైదానంలో అతన్ని ఢీకొట్టి స్లెడ్జింగ్ కు దిగాడు. వీడియో చూస్తే విరాట్ ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్టు తెలిసిపోతోంది.. నిజానికి కోహ్లీ లాంటి ప్లేయర్ ఇలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు… మైదానంలో విరాట్ దూకుడు అందరికీ తెలుసు… కానీ చాలా సందర్భాల్లో కోహ్లీ ప్రత్యర్థి కవ్విస్తే తప్ప రియాక్ట్ కాడు… వికెట్ తీసినప్పుడు కాస్త అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకోవడమూ చూశాం… అయితే సుధీర్ఘ అనుభవం ఉండి, ఒక యువ ఆటగాడి విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.. ఈ మ్యాచ్ లో ఎక్కడా కూడా శామ్ కొంటాస్ భారత ఆటగాళ్ళతో గొడవ పడలేదు. తన బ్యాటింగ్ పై పూర్తి ఫోకస్ తో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. బూమ్రానే కాదు మిగిలిన భారత బౌలర్లను సైతం సమర్థంగా ఎదుర్కొని తన జట్టు భారీస్కోరుకు చక్కని ఆరంభాన్నిచ్చాడు.

అలాంటి యంగ్ క్రికెటర్ టాలెంట్ ను కోహ్లీ లాంటి ప్లేయర్ అభినందించాల్సింది పోయి ఢీకొట్టి స్లెడ్జింగ్ కు దిగడం ఖచ్చితంగా తప్పే… కోహ్లీ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన ఆటగాడు కాదు… ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూసి , వారికి సమాధానమిచ్చి వచ్చిన వాడే… టాలెంట్ ఉన్న ప్రత్యర్థి ఆటగాళ్ళను సైతం అభినందించడం క్రీడాస్ఫూర్తి అనిపించుకుంటుంది.. కానీ కోహ్లీ మాత్రం అభినందించలేదు సరికదా కాస్త అతిగా ప్రవర్తించాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఎవ్వరూ ఊహించలేదు… ఒకవిధంగా కొంటాస్ ను రెచ్చగొట్టి కోహ్లీ జట్టుకు మరింత చేటు చేశాడు. కోహ్లీతో గొడవ తర్వాతే కొంటాస్ మరింత రెచ్చిపోయాడు. ఆటతోనే సమాధానమిచ్చి పైచేయి సాధించాడు.

ఇదిలా ఉంటే అవకాశం దొరకడంతో కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అటు భారత మాజీ క్రికెటర్లు సైతం విరాట్ తీరును తప్పుపట్టారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీపై రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. నిజానికి విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుందని కూడా జోరుగా చర్చ సాగింది. కానీ అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్-1 నేరంగా పరిగణించి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించాడు.

24 నెలల కాలంలో ఏ ఆటగాడైన నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్‌ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. రాబోయే రెండెళ్లలో కోహ్లీ మరో డీ మెరిట్ పాయింట్స్ పొందితే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు ఇలా దిగజారి ప్రవర్తించడం టీమిండియా ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. తొలిసారి ఇలాంటి ప్రవర్తనతో ఆసీస్ గడ్డపై భారత్ పరువు తీశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.