భారత్ ఆడితే అట్లుంటది ఎక్స్ ట్రా టికెట్లు రిలీజ్
వరల్డ్ క్రికెట్ లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా... మన జట్టు ఎక్కడ , ఏ ఫార్మాట్ లో ఆడినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు..

వరల్డ్ క్రికెట్ లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… మన జట్టు ఎక్కడ , ఏ ఫార్మాట్ లో ఆడినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు.. స్టేడియాలకు వచ్చి మ్యాచ్ ను చూసేందుకు ఎగబడుతుంటారు. అందుకే భారత్ తో మ్యాచ్ లు అంటే ఐసీసీకి కాసుల పంటే… అందుకే టీమిండియా మ్యాచ్ లపై ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తుంది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లను చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్ ల కోసం ఎక్స్ ట్రా టికెట్లను అందుబాటులో ఉంచింది ఇప్పటికే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసినట్లు తెలిపింది.
టీమిండియా ఆడే మూడు గ్రూప్ మ్యాచులకు అదనంగా టికెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తొలి సెమీఫైనల్ కు సంబంధించి పరిమిత టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించింది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో పోటీ పడనుది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే భారత్, పాక్ మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాయాదుల పోరు.కు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 25,000గా ఉంది. అయితే భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల కోసం సుమారు 1,50,000 మంది ఒకేసారి ఆన్‌లైన్ ప్రయత్నించారని తెలుస్తోంది. అందులో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే టికెట్ దక్కినట్లయింది. గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయాయని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఆ మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు మార్చి 4న తొలి సెమీస్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మార్చి 9న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లను.. తొలి సెమీస్ ముగిశాక విడుదల చేస్తామని తెలిపింది. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. దుబాయ్ వేదికగానే తుది పోరు జరగనుంది. లేదంటే లాహోర్ వేదికగా టైటిల్ పోరు ఉంటుంది. కాబట్టి ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్ అవ్వాలంటే తొలి సెమీస్ రిజల్ట్ రావాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 19న ఓపెనింగ్ మ్యాచ్ పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది.