అభిమాన సునామీ కోహ్లీ కోసం పోటెత్తిన ఫ్యాన్స్

మన దేశంలో క్రికెటర్లకు, వారు ఆడే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు... అంతర్జాతీయ మ్యాచ్ అయితే స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు.. కానీ రంజీ మ్యాచ్ కు స్టేడియం నిండిపోవడం ఎప్పుడైనా చూశారా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 03:35 PMLast Updated on: Jan 31, 2025 | 3:35 PM

Fans Flocked For Favorite Tsunami Kohli

మన దేశంలో క్రికెటర్లకు, వారు ఆడే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు… అంతర్జాతీయ మ్యాచ్ అయితే స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు.. కానీ రంజీ మ్యాచ్ కు స్టేడియం నిండిపోవడం ఎప్పుడైనా చూశారా.. అది కూడా స్టేడియం నిండిపోయి, ఇంకా రెట్టింపు అభిమానులు స్టేడియం బయట ఉండిపోయారు.. ఇదీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దగ్గర ఇవాళ పరిస్థితి… ఈ స్థాయిలో ఫ్యాన్స్ రావడానికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే కారణం… దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫామ్ లోకి వచ్చేందుకు దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీని చూసేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివచ్చారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి క్యూ కట్టారు. తెల్లవారుఝామున 3 గంటల నుంచే స్టేడియాల దగ్గరకు భారీగా వచ్చేశారు. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందే స్టేడియం చుట్టుపక్కల కిక్కిరిసిపోయింది. గేట్లు తెరిచిన తర్వాత లోపలకి వెళ్ళేందుకూ ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది.

రంజీ మ్యాచ్ ను చూసేందుకు ఈ స్థాయిలో అభిమానులు రావడం ఇదే తొలిసారి. కేవలం కోహ్లీ కోసమే స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గురువారం సోషల్ మీడియాలో కోహ్లీ రంజీ మ్యాచ్ ఫోటోలే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా.. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది. దాంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెడ నొప్పి‌తో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ.. గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. అయితే ఫ్రీ ఎంట్రీ కావడం, కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడడంతో స్టేడియంలోని ప్రతీ స్టాండ్ ప్రేక్షకులతో నిండిపోయింది. భద్రతా కారణాలతో కొంత మంది అభిమానులు పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది. కాగా తొలి రోజు ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి అతని కాళ్లు మొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. తాజా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సెక్యూరిటీ తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో వెంటనే పారమిలిటరీ బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. స్టేడియాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఫ్యాన్స్ ను కంట్రోల్ చేస్తూ భద్రతను కల్పించాయి.