Wrestlers Protest: రెజ్లర్లకు పెరుగుతున్న మద్దతు.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఎదురుదెబ్బ!

నిన్నటివరకు అసలు స్పందించని బీజేపీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా రెజ్లర్లకు మద్దతిస్తున్నారు. రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర) రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 05:50 PMLast Updated on: Jun 02, 2023 | 5:50 PM

Farmers Set June 9 Deadline For Arrest Of Wfi Chief Warn Of Nationwide Stir

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, భజ్‌రంగ్ పునియా.. సహా పలువురు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. నిన్నటివరకు అసలు స్పందించని బీజేపీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా రెజ్లర్లకు మద్దతిస్తున్నారు. రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర) రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఇప్పటివరకు పెద్దగా స్పందించని క్రీడాలోకం కూడా ఇప్పుడు స్పందిస్తోంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు కూడా రెజ్లర్లకు మద్దతుగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రైతు సమాఖ్య, ప్రతిపక్షాలు రెజ్లర్లకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. రెజ్లర్లను పోలీసులు అమానవీయంగా లాక్కెళ్లడం తమనెంతో బాధించిందని 1983 వరల్డ్ కప్ జట్టు విజేతలు తెలిపారు. ఆ జట్టుకు చెందిన మదన్ లాల్ ఆధ్వర్యంలో ఈ ప్రకటన విడుదలైంది. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు, ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

పతకాల్ని గంగలో కలపాలనుకోవడం సరికాదన్నారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా దీనిపై స్పందించారు. కేంద్రం నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుకుంటోందని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. న్యాయ ప్రక్రియకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసు విచారణలో పక్షపాతానికి తావులేదని, తీర్పును బట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే కూడా ఈ అంశంపై స్పందించారు. మహిళ నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ముందు విచారణ చేపట్టాలని, అలా కాకుండా విచారణ జాప్యం చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు.

రెజ్లర్లు చాలా కష్టపడి సాధించిన పతకాలని గంగలో కలపాలని నిర్ణయం తీసుకున్నారంటే వాళ్లు ఎంతటి వేధనకు గురయ్యారో అర్థమవుతోందన్నారు. తాను బీజేపీ ప్రతినిధే అయినప్పటికీ ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు సరికాదన్నారు. ఒక ఎంపీగా కాకుండా.. ఒక మహిళగా వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా వరుసగా రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి రెజ్లర్లకు మద్దతు లభిస్తోంది. మరోవైపు ఈ నెల 9 లోపు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.
బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఎదురుదెబ్బ!
ఇంతకాలం రెజ్లర్ల ఆరోపణల్ని తిప్పికొట్టిన బ్రిజ్ భూషణ్ సింగ్‌కు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. అతడు క్రీడాకారిణులను లైంగికంగా వేధించినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కోచ్ లేని సమయంలో తమపై లైంగిక దాడికి పాల్పడేవాడని, తన కోరిక తీరిస్తే ఖర్చు భరిస్తానని మభ్యపెట్టేవాడని క్రీడాకారిణులు ఆరోపించారు. మైనర్‌ను కూడా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అతడిపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ నెల 5న యూపీలో సాధువులతో జన్ చేతన్ అనే ర్యాలీని నిర్వహించాలని బ్రిజ్ భూషణ్ సింగ్‌ భావించారు. దీనికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే, ఈ ర్యాలీ నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతివ్వలేదని తెలుస్తోంది. తనపై కోర్టు విచారణ సాగుతున్నందున, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఈ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు బ్రిజ్ భూషణ్ సింగ్‌ ప్రకటించారు.