Team India: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి
వెస్టిండీస్ చేతిలో రెండో వన్డే ఓడిపోయిన భారత జట్టుపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. 'ఇలా ఓడిపోవడమేనా వన్డే ప్రపంచకప్ కోసం చేసే సన్నాహాలు' అంటూ పలువురు అభిమానులు మండిపడుతున్నారు.
ఈ కాలం ఆటగాళ్లు డబ్బు, గర్వం వల్ల ఆట దృష్టి సారించడంలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా విమర్శించాడు. ఈ తరహాలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా భారత జట్టు ఆటతీరుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. అన్ని ఉన్నా టీమిండియా దారుణంగా విఫలమవుతోందని, పరిమిత ఓవర్ల క్రికెట్లో చేతులెత్తేస్తోందని ప్రసాద్ అన్నాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్లో ప్రసాద్ ‘టెస్ట్ క్రికెట్ మినహా రెండు ఫార్మాట్లలోనూ టీమిండియా చాలా ఆర్డినరీగా ఆడుతోంది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లను కోల్పోయింది. చివరి 2 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ పేలవంగా ఆడింది. భారత ఇంగ్లాండ్ లాంటి ఎగ్జెటింగ్ టీమ్ లేదా ఆసీస్ లాంటి దూకుడు జట్టు కాదు. డబ్బు, అధికారం ఉన్నా సాధారణ విజయాలకే సంబరాలు చేసుకుంటున్నాం. చాంపియన్గా భారత జట్టు చాలా దూరంలో ఉంది. భారత్ సహా అన్ని జట్లు చాంపియన్ అవ్వాలనే ఆడతాయి కానీ కాలానుగుణంగా మారిన టీమిండియా వైఖరి, ఆటతీరు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమ’ని రాసుకొచ్చాడు.