అతని కెరీర్ నాశనం చేయకు గంభీర్ పై మాజీ క్రికెటర్ల ఫైర్
గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే గంభీర్ నిర్ణయాలు సఫలం కాకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే గంభీర్ నిర్ణయాలు సఫలం కాకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. కెెఎల్ రాహుల్ లాంటి ప్రధాన బ్యాటర్ కంటే ముందు అక్షర్ పటేల్ ను ముందు పంపిస్తుండడంపై పలువురు మాజీలు మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ గంభీర్ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తాడు. గంభీర్ విధానాలు ఆటగాళ్లను అభద్రతా భావానికి గురి చేస్తోందని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
గంభీర్ టీమిండియా బ్యాటింగ్ ఫార్మేట్ పై ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. ఓపెనర్లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడనీ, ఇది సరికాదంటున్నాడు. గంభీర్ స్ట్రాటజీతో ఆటగాళ్లు అభద్రతా భావానికి గురవుతున్నారని అభిప్రాయపడ్డాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫ్లెక్సిబిలిటీ పాటిస్తే కొన్ని నియమాలు కూడా వర్తిస్తాయన్నాడు. వాటిని గంభీర్ కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జహీర్ ఖాన్ గంభీర్ వ్యూహాన్ని ప్రశ్నించడమే కాకుండా అతన్ని హెచ్చరించాడు.
మరోవైపు భారత జట్టు మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా గంభీర్ నిర్ణయాల్ని తప్పుబట్టాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చడంతో జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2023 ప్రపంచ కప్‌లో 5వ స్థానంలో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కానీ అప్పటి నుండి అతని బ్యాటింగ్ స్థానం మారుతూ వచ్చింది. దీనిపై శ్రీకాంత్ మండిపడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాహుల్‌ను 6వ స్థానంలో పంపుతున్నారనీ, అక్షర్ స్థానంలో రాహుల్ ని పంపడం ఏం వ్యూహమో తనకైతే అర్థం కావడం లేదన్నాడు. రాహుల్ ను 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తే సౌకర్యంగా ఆడలేడన్నాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా ఉన్న ఆటగాడి కోసం సీనియర్ బ్యాటర్ కెరీర్ ను నాశనం చేయొద్దన్నాడు. గంభీర్ రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.
నిజానికి రాహుల్ తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచాడు. ఒకవిధంగా అతని బ్యాటింగ్ ప్లేస్ ను మార్చడమే ఈ వైఫల్యాలకు కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గంభీర్ వ్యూహాలను తప్పుపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం జట్టుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.