చాహల్ కెరీర్ ను నాశనం చేశారు బీసీసీఐపై ఆకాశ్ చోప్రా ఫైర్
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్ళు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా సిరీస్ కు లేదా మెగాటోర్నీకి జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్ళు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా సిరీస్ కు లేదా మెగాటోర్నీకి జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. అయితే ఫామ్ లో కొనసాగుతున్నా కొందరికి మాత్రం చోటు దక్కడం లేదు. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల ప్రకటించిన జట్టులో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. వైట్ బాల్ క్రికెట్ లో చాహల్ నిలకడగానే రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైనప్పటకీ కౌంటీ క్రికెట్ లోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కారణంగా చాహల్ వెనుకబడిపోయాడు. ఫామ్ లో ఉన్నా అతనికి చోటు దక్కకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
తాజాగా చాహల్ విషయంలో బీసీసీఐపై ఫైర్ అయ్యాడు మాజీ ఓపెనర్ , కామెంటేటర్ ఆకాశ్ చోప్రా… చాహల్ కెరీర్ ముగిసిపోవడానికి బీసీసీఐనే కారణమని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ,టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా చాహల్ కెరీర్‌ను ముగించిందని చోప్రా ఆరోపించాడు. రెండేళ్ల క్రితం వన్డేలకు దూరంగా ఉన్నప్పుడు చాహల్ గణాంకాలు బాగున్నాయని వాదించాడు. అతనికి భారత జట్టులో దారులు మూసుకుపోయాయన్నాడు. బీసీసీఐ,టీమ్ మేనేజ్‌మెంట్ ఇలా ఎందుకు చేసిందో అర్థం కాలేదన్నాడు. అతని వన్డే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయనీ, చాలా వికెట్లు తీయడంతో పాటు నిలకడగా రాణించాడనీ గుర్తు చేశాడు.
ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే చాహల్ రీఎంట్రీ ఇక అసాధ్యంగానే కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కినా అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు. టీ ట్వంటీల్లో 96 వికెట్లతో భారత్ తరపున చాహల్ అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా ఈ స్పిన్నర్ రికార్డు సృష్టించాడు. తాజాగా చాహల్ రికార్డును అర్షదీప్ సింగ్ బ్రేక్ చేశాడు. ఇక చాహల్ ఐపీఎల్ లో మాత్రమే ఆడుకోవాల్సి ఉంటుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.