Salman Bhatt: మళ్ళీ పోలిక పెట్టిన పాక్ క్రికెటర్.. దూల తీరుస్తున్న టీమిండియా ఫ్యాన్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడిలో ఆడలేడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. ఇప్పటి వరకు కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించింది లేదని గుర్తు చేశాడు.
ఈ కారణం చేతనే విరాట్ కోహ్లీలా రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కాలేకపోయాడని చెప్పుకొచ్చాడు. శ్రీలంక వేదికగా జరిగే ఆసియాకప్ 2023 వన్డే టోర్నీలో సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ల నేపథ్యంలో భారత టీమ్ కాంబినేషన్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా చర్చించిన సల్మాన్ బట్.. రోహిత్ శర్మకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్. ఇది నేను ఒప్పుకుంటా. అతను ఎన్నో ఘనతలను అందుకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్నాడు. అయితే కొందరు ప్లేయర్లు ఒత్తిడిని అస్సలు తట్టుకోలేరు. ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా వస్తాడు. ఒత్తిడిని అధిగమించి ఆడటం రోహిత్ శర్మ వల్ల కాదు.అందుకే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్ శర్మ విఫలమవుతాడు. ఇప్పటి వరకు కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి గెలిపించినట్టు నాకైతే గుర్తు లేదు. జట్టుకి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ బాగా ఆడింది లేదు.
విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న తేడా అదే. సాధారణ మ్యాచుల్లో బాగా ఆడితే మంచి ప్లేయర్ అని మాత్రమే అంటారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడితేనే గొప్ప ప్లేయర్ అవుతారు అని సల్మాన్ వివరించగా, దీనిపై టీమిండియా అభిమానులు ఘాటైన రెప్లైస్ తో కామెంట్స్ చేస్తున్నారు. విరాట్, రోహిత్ ఇద్దరిదీ ఎవరి స్టైల్ వారిదే. ఇలాంటి పోలికలు పాకిస్థాన్ ప్లేయర్స్ మధ్యలో పెడితే, జట్టు కొంతయినా మెరుగుపడే అవకాశము ఉందని బదులిస్తున్నారు.