జట్టు కంటే ఎక్కువ కాదు, కోహ్లీ,రోహిత్ లపై గంభీర్
ఆస్ట్రేలియా పర్యటనలో ఈ సారి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరిగినంత చర్చ మరెవరి గురించీ జరగలేదు. వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడకపోవడంతో విమర్శలు వచ్చాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఈ సారి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరిగినంత చర్చ మరెవరి గురించీ జరగలేదు. వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడకపోవడంతో విమర్శలు వచ్చాయి. పేలవమైన ఫామ్ తో నిరాశపరచడంతో రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే సిడ్నీ టెస్టుకు ముందు తుది జట్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫామ్ లో లేను కాబట్టే తప్పుకుంటున్నానని రోహిత్ చెప్పినా కూడా గంభీర్ తప్పించాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా దీనిపై గంభీర్ స్పందించాడు. ఎంత పెద్ద ఆటగాళ్లు అయినా జట్టు తర్వాతేనని, టీమ్ కంటే ఎవరూ ముఖ్యం కాదని గంభీర్ మరోసారి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండటాన్ని ప్రశంసించాడు. కెప్టెన్‌గా రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడని, ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడాడు.
గంభీర్.. ఆఖరి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు. ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా దూరంగా ఉండటం తప్పు కాదన్నాడు. జట్టు కంటే ఎవరూ ముఖ్యం కాదనే విషయాన్ని రోహిత్ శర్మ అందరికి తెలిసేలా చేశాడని కితాబిచ్చాడు. చివరి టెస్ట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మపై వార్తలు రాసేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించాల్సిందని గంభీర్ రిపోర్టర్‌లకు చురకలంటించాడు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై తాను మాట్లాడలేనని గంభీర్ స్పష్టం చేశాడు.అది వారి వ్యక్తిగత నిర్ణయమని, వారికి ఆటపై ప్రేమ, కమిట్‌మెంట్ ఉన్నాయన్నాడు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి వారు చేయగలిగినదంతా చేస్తారంటూ వ్యాఖ్యానించాడు.
ఇక జట్టు ప్రక్షాళణ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నాడు. ఐదు నెలల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదన్నాడు. ప్రతీ ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ ఆడే సమయం ఉంటే.. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే నిబద్దత ఉంటే ఎవరైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో రాణించిన యువ ఆటగాళ్ళను గంభీర్ ప్రశంసించాడు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించారన్నాడు.