భారత్ బి జట్టుపైనా గెలవలేరు, పాకిస్తాన్ పై గవాస్కర్ కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ కనీసం సెమీస్ కు చేరలేకపోయింది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ కనీసం సెమీస్ కు చేరలేకపోయింది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంతగడ్డపై ఇంతకంటే అవమానం మరొకటి లేదంటూ పాక్ అభిమానులు, ఆ దేశ మాజీ ఆటగాళ్ళు మండిపడుతున్నారు. సిఫార్సులతో ఆటగాళ్ళను ఎంపిక చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ పాక్ మాజీలు పీసీబీపై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత బి జట్టుతో కూడా గెలవదని గవాస్కర్ అన్నాడు. పాకిస్థాన్‌లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదవ ఉండదని, కానీ వారి బెంచ్ బలంగా లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.
ఆ జట్టు యువ ఆటగాళ్లను తయారు చేసుకోలేకపోయిందన్నాడు. భారత్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ అప్రోచ్ సరిగ్గా లేకనే ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. భారత సీ టీమ్ కూడా పాక్ ను ఓడిస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేనంటూ వ్యాఖ్యానించాడు. కానీ బీ టీమ్ మాత్రం పాకిస్థాన్‌ను ఖచ్చితంగా ఓడిస్తుందని చెప్పాడు. ఆ జట్టు బ్యాటింగ్ లో దూకుడు లేకపోవడం ఓటమికి కారణమైందన్నాడు. అదే సమయంలో భారత స్పిన్నర్లు త్వరగా ఓవర్లు ముగించడంతో పాక్ బ్యాటర్లు తడబడ్డారన్నాడు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో టాలెంట్ కు మాత్రం కొదవలేదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కానీ వారిని గుర్తించడంలో తప్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డాడు. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను పాకిస్థాన్ తయారు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
ఐపీఎల్ ద్వారా భారత్ ఎలాంటి వైట్‌బాల్ ఆటగాళ్లను తయరు చేసిందో మనం చూస్తున్నామనీ, వారికి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఉన్నా మంచి ప్లేయర్స్ రావడం లేదన్నాడు. దేశవాళీ క్రికెట్ నుంచి నాణ్యమైన యువ ఆటగాళ్ళను ఎందుకు తయారుచేయలేకపోతున్నామన్నది పాక్ క్రికెట్ బోర్డు ఆలోచించుకోవాలంటూ గవాస్కర్ సూచించాడు. కాగా ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిన పాకిస్తాన్.. కివీస్ పై బంగ్లాదేశ్ పరాజయంతో ఇంటిదారి పట్టింది. దీంతో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. మార్చి 2న ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో గ్రూప్ ఏ టాపర్ ఎవరో తేలనుంది.