బిగ్గెస్ట్ స్డేడియంలో గిల్ దూకుడు ,భారత క్రికెటర్ రికార్డుల మోత
అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం భారత స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కు హోంగ్రౌండ్ లా మారిపోయింది. టెస్ట్ , వన్డే, ఐపీఎల్... ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఇక్కడ గిల్ పరుగుల వరద పారించాడు.

అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం భారత స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కు హోంగ్రౌండ్ లా మారిపోయింది. టెస్ట్ , వన్డే, ఐపీఎల్… ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఇక్కడ గిల్ పరుగుల వరద పారించాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ గిల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో సెంచరీ బాదాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సూపర్ ఫామ్ తో దూసుకెళుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా అద్బుతమైన శతకంతో మెరిశాడు. ఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో గిల్ ఐదో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు డుప్లెసిస్ వాండరర్స్ స్టేడియంలోనూ, డేవిడ్ వార్నర్ అడిలైడ్ లోనూ, పాక్ క్రికెటర్ బాబర్ ఆజం కరాచిలోనూ , సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సెంచూరియన్ స్టేడియంలోనూ ఈ అరుదైన ఫీట్ సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు గిల్ మరోసారి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ.తద్వారా తమ 50వ వన్డే మ్యాచ్ లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్ గా ఘతన సాధించాడు. అలానే 50 ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా ఏడు వన్డే సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గానూ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును అందుకున్నాడు. అంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడి రికార్డునే శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు. గతంలో శ్రేయాస్ అయ్యర్, ధావన్ 59 ఇన్నింగ్స్‌లలో 2500 రన్స్ పూర్తి చేస్తే… కేఎల్ రాహుల్-63 ఇన్నింగ్స్‌లలోనూ, కోహ్లీ, సిద్ధూ 64 ఇన్నింగ్స్‌లలోనూ ఈ ఘనతను అందుకున్నారు.
మరోవైపు తన 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా శుబ్‌మన్ గిల్ ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 60.83 సగటుతో 2535 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 16 ఆర్ధశతకాలు ఉన్నాయి. మూడో వన్డేలో 51 బంతుల్లో అర్ధ శతకాన్ని బాదాడు గిల్. ఈ సిరీస్‌లో అతడికిది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గిల్ కన్నా ముందు దిలీప్ వెంగ్ సర్కార్ శ్రీకాంత్ , మహమ్మద్ అజారుద్దీన్ , ధోనీ, శ్రేయాస్ అయ్యర్ ,ఇషాన్ కిషన్ ఈ ఘతనకు అందుకున్నారు.