Glenn Maxwell: మ్యాక్సీ.. నువ్‌ మనిషివేనా.. ఆఫ్గన్‌పై రికార్డ్ డబుల్ సెంచరీ..!

ముంబై వాంఖెడేలో జరిగిన వరల్డ్‌ కప్ మ్యాచ్‌లో మ్యాక్సీ కొట్టిన షాట్లకు అఫ్గానిస్థాన్ మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్‌లో సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు.. చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది మ్యాక్స్ మామ విధ్వంసం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2023 | 02:10 PMLast Updated on: Nov 08, 2023 | 2:10 PM

Glenn Maxwell Slams 201 To Help Australia Beat Afghanistan In World Cup 2023

Glenn Maxwell: వాల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా (Australia) సంచలన విజయం. దాదాపుగా ఓడిపోయిందనుకున్న మ్యాచ్‌ను.. ఒంటి చేత్తో గెలిపించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell). ఫోర్లు, సిక్సులతో చెలరేగిన మ్యాక్సీ.. 201 పరుగులతో రికార్డ్ క్రియేట్ చేశాడు. అఫ్ఘన్ (Afghanistan) నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడమే కాకుండా.. సెమీస్‌లోకి ఆస్ట్రేలియా ఎంట్రీ ఇచ్చేలా ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడీ మాన్‌స్టర్. ఎవడైనా కోపంగా కొడతాడు.. లేకపోతే బలంగా కొడతాడు.. ఈడేంట్రా ఏదో గోడ కట్టినట్లు.. గులాబీ మొక్కకి అంటుకట్టినట్లు.. చాలా శ్రద్ధగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జీ.. ఓ సినిమా డైలాగ్ ఇది. అఫ్గనిస్థాన్ క్రికెటర్లకు తెలుగు అర్థమైతే.. ఆసిస్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ కొట్టిన కొట్టుడుకు అక్షరం పొల్లు పోకుండా ఈ డైలాగ్‌ను రిపీట్‌ చేసుకునే వాళ్లు.

అవును.. ముంబై వాంఖెడేలో జరిగిన వరల్డ్‌ కప్ మ్యాచ్‌లో మ్యాక్సీ కొట్టిన షాట్లకు అఫ్గానిస్థాన్ మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్‌లో సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు.. చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది మ్యాక్స్ మామ విధ్వంసం. మరోవైపు.. ఓడిపోయే మ్యాచ్‌లో మ్యాక్సీ మిరాకిల్ చేయడంతో.. ఆసిస్ వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిన అఫ్గానిస్థాన్‌కు గుండెకోత మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 292 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసిస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో.. అఘ్గన్ మరో సంచలనం సృష్టించడం ఖాయమనే అంతా అనుకున్నారు.

TELANGANA CONGRESS: సూర్యాపేట, తుంగతుర్తి ఎవరికి.. కాంగ్రెస్‌లో ఆ 4 సీట్లు వారికేనా..

91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసిస్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అసలు.. తమ జట్టు గెలుస్తుందని ఆసీస్ ఆటగాళ్లే అనుకుని ఉండరు. కానీ.. ప్యాట్ కమిన్స్‌తో కలిసి గ్లేన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నాడు. తనకే సాధ్యమైన మ్యాడ్ షాట్లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నూర్ అహ్మద్ వేసిన 22వ ఓవర్‌లో.. షార్ట్ ఫైన్ లెగ్‌లో మ్యాక్సీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ మిస్ చేయడం అఫ్గన్‌కు శాపంగా మారింది. ఎందుకంటే.. అప్పటికీ మ్యాక్స్‌వెల్ స్కోర్ కేవలం 34 పరుగులు మాత్రమే.. అక్కడ లైఫ్ దొరకడంతో.. మ్యాక్స్ వెల్ ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆఫ్ఘన్ బౌలింగ్‌ను అలా ఇలా కొట్టలేదు. కొడితే బంతి స్టాండ్స్‌లో పడాలి అన్నంత కసిగా కొట్టాడు. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. 76 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. 104 బంతుల్లో 150 పరుగులు చేసిన సమయంలో.. కాళ్ల తిమ్మిర్లు ఇబ్బంది పెట్టాయి. అయినా కూడా.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 128 బంతుల్లో 201 పరుగులు చేస్తే.. అందులో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే ఏ రేంజ్‌లో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. తాజా వరల్డ్ కప్‌లో ఆసీస్‌కు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్ కాగా.. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ రికార్డు క్రియేట్ చేశాడు.

PAWAN KALYAN: తెలంగాణలో పవన్ రాంగ్‌ స్టెప్‌.. బొక్కాబోర్లా పడడం ఖాయమా..

మరోవైపు.. ఆసీస్ విజయానికి 24 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన సమయంలో 47వ ఓవర్‌ వేసిన ముజీబ్.. వరుసగా 6, 6, 4, 6 ఇచ్చాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతున్న మ్యాక్సీని భారీ షాట్లు ఆడకుండా అడ్డుకొని ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగేది. కానీ.. గెలవాల్సిన మ్యాచ్ లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒక్క క్యాచ్ జారవిడవడం.. ఒక ఓవర్‌లో ధారాళంగా పరుగులివ్వడంతో.. ఏకంగా మ్యాచ్‌నే కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు గుండె పగిలినంత పనైంది. ఇక, ఈ విజయంతో ఆసీస్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. టోర్నీలో ఆసీస్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌‌లు ఆడి 6 విజయాలు సాధించింది.