యువ క్రికెటర్ కు గోల్డెన్ ఛాన్స్ టెస్టుల్లోనూ అతనే వైస్ కెప్టెన్
రోహిత్ శర్మ వారసుని వేటలో పడిన బీసీసీఐ యువక్రికెటర్లను భవిష్యత్తు నాయకులిగా తయారుచేసేందురు రెడీ అవుతోంది.
రోహిత్ శర్మ వారసుని వేటలో పడిన బీసీసీఐ యువక్రికెటర్లను భవిష్యత్తు నాయకులిగా తయారుచేసేందురు రెడీ అవుతోంది. టీ ట్వంటీ ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సెలక్టర్లు మిగిలిన రెండు ఫార్మాట్ లలో వైస్ కెప్టెన్సీపై కూడా ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా శుభమన్ గిల్ ను అన్ని ఫార్మాట్లలో వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే గిల్ టీ ట్వంటీలతో పాటు వన్డేల్లోనూ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే టెస్టుల్లో మాత్రం స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ కు బూమ్రా దూరమైతే గిల్ కే ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. గిల్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఏ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథ్యం వహించిన గిల్ ఇటీవల ముగిసిన శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ కు గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
కాగా బుమ్రా గైర్హాజరీతో బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు గిల్ నే వైస్ కెప్టెన్ గా ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గిల్ ను ఫ్యూచర్ కెప్టెన్ గా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రెడ్ బాల్ క్రికెట్ లోనూ నాయకుడిగా తయారుచేయాలని నిర్ణయించినట్టు భావిస్తున్నారు. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ గా ఉన్న ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కొత్త కోచ్ గంభీర్ కూడా బోర్డుకు చెప్పినట్టు సమాచారం. దీని ప్రకారం చూస్తే అన్ని ఫార్మాట్లలో గిల్ కే ఆ ఛాన్సుంది.