ప్లాస్టిక్ బాల్ తో ప్రాక్టీస్..వరల్డ్ కప్ విన్నర్ ఎవరీ గొంగడి త్రిష ?
భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్స్ గా ఎదిగిన వారు చాలామంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినోళ్ళే... మహిళల క్రికెట్ కూడా దీనికి మినహాయింపు కాదు...ఇదే తరహాలో కష్టాలను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది తెలుగమ్మాయి గొంగడి త్రిష...
భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్స్ గా ఎదిగిన వారు చాలామంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినోళ్ళే… మహిళల క్రికెట్ కూడా దీనికి మినహాయింపు కాదు…ఇదే తరహాలో కష్టాలను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది తెలుగమ్మాయి గొంగడి త్రిష… అండర్ 19 ప్రపంచకప్ సెంచరీ చేయడంతో త్రిష పేరు మారుమోగిపోతోంది. టీ ట్వంటీల్లో హాఫ్ సెంచరీ చేయడమే గొప్ప విషయమనుకుంటే ఏకంగా సెంచరీ బాదేసింది ఈ భద్రచాలం అమ్మాయి… వరల్డ్ కప్ ఆద్యంతం అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన గొంగడి త్రిష జర్నీ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేదే…
ఖమ్మంలోని భద్రాచలం ఈమె స్వస్థలం. త్రిష తండ్రి రామిరెడ్డి అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్‌లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సాహించారు. కానీ, కూతురు సత్తా, ఉత్సాహం చూసి.. తను క్రికెట్‌కు బాగా సరిపోతుందని గుర్తించి అందులోనే ప్రోత్సహించారు. చిన్న వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో ఆయనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఐదేళ్ల వయసొచ్చాక తనతో పాటు జిమ్‌కు తీసుకెళ్లి.. రోజుకు మూడొందల బంతులతో త్రిష చేత ప్రాక్టీస్ చేయించేవారు.
త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి.. 2012లో హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలో జాయిన్ చేసారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రెండేళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. 2023లో త్రిషకు ఏకంగా ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఆ సిరీస్‌లో ఫైనల్‌లో 24 రన్స్ చేసి జట్టు విజయానికి తోడ్పడింది. ఇప్పుడు మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 ఉమెన్స్ టీ-20 ప్రపంచ కప్‌లో కూడా త్రిష అదరగొట్టింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష 59 బాల్స్‌లో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
త్రిష ఆటను చూసి ఆమె తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారు. తన కూతురు మంచి క్రికెటర్‌గా ఎదిగితే చాలనుకున్న ఆయన.. ఖర్చుల కోసం 4 ఎకరాల పొలాన్ని సైతం అమ్మేశారు. తండ్రి త్యాగం, తన కష్టం ఫలించి.. త్రిష అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిచింది. మెగా టోర్నీలో 309 పరుగులు, 7 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ అద్భుతమైన ఆటతీరుతో తన కోసం తన తండ్రి పడిన కష్టాలు, బాధలన్నీ మర్చిపోయేలా చేసింది. త్రిష కెరీర్ కు ఇది ఆరంభం మాత్రమే…. ఇకపై సీనియర్ క్రికెటర్ గా మరిన్ని శిఖరాలు అందుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష.. ఆటల్లో ఏముందిలే అనుకునే వారికి త్రిష కెరీర్ గొప్ప ఉదాహారణ.. అలాగే పిల్లలకు చదువు మాత్రమే కాదు వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే ఛాంపియన్లు అవుతారనడానికి కూడా ఆమె జర్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.