భారత్ కు గుడ్ న్యూస్ ,మెగాటోర్నీకి కుల్దీప్ ఫిట్
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడు వారాలే మిగిలుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. భారత జట్టు పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడు వారాలే మిగిలుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. భారత జట్టు పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను కూడా ప్రకటించారు. కానీ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ లపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకుంటుండగా టోర్నీ లీగ్ స్టేజ్ మ్యాచ్ ల సమయానికే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మాత్రం భారత్ కు గుడ్ న్యూస్ అందింది. ఈ మెగా టోర్నీకి కుల్దీప్ ఫిట్ నెస్ టెస్ట్ పాసయ్యాడు.
గతేడాది అక్టోబర్ లో కుల్దీప్ కు సర్జరీ జరిగింది. అప్పటి నుంచి జాతీయ జట్టుకు అతను దూరమయ్యాడు. క్రమంగా కోలుకున్న ఈ స్పిన్నర్ ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను తాను ఫిట్ నెస్ సాధించేందుకు సహకరించిన ఎన్సీఏ టీమ్ కు కుల్దీప్ థ్యాంక్స్ చెప్పాడు.ప్రస్తుతం కుల్దీప్ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బరిలోకి దిగిన కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు కూడా అతను ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తన ఫామ్ నిరూపించుకునేందుకు ఈ సిరీస్ కుల్దీప్ కు మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ సాధించినప్పటకీ.. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో రాణిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుండగా.. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తోనూ, మార్చి2న న్యూజిలాండ్ తోనూ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరగనుండడంతో స్పిన్నర్లే కీలకం కానున్నారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ సాధించడం టీమిండియాకు గుడ్ న్యూస్ గానే చెప్పాలి.