ముంబైకి గుడ్ న్యూస్, ప్రాక్టీస్ మొదలుపెట్టిన బుమ్రా
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా టూర్ చివర్లో బుమ్రా గాయపడ్డాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడి ఆ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. తర్వాత ఇంగ్లాండ్ తో సిరీస్ కూ, ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అయితే తను గాయం నుంచి కోలుకుని, బౌలింగ్ చేస్తున్ వీడియోను తాజాగా బుమ్రా పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో తను ఈ వీడియోను పోస్టు చేస్తున్నాడు. రోజుకింత చొప్పున మెరుగవుతున్నట్లు బుమ్రా అందులో పేర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో చివరిసారిగా బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సిడ్నీలో జరిగిన ఆ టెస్టులో వెన్ను నొప్పితో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేక పోయాడు.
ఇక గతేడాది బుమ్రా నామ సంవత్సరంగా గడించింది. టెస్టుల్లో 71 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి, రికార్డులకెక్కాడు. భారత్ తరపున అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన పేసర్ గా రికార్డు నెలకొల్పాడు. అలాగే బిలో 20 సగటుతో 200 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీగా నిలిచాడు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్పులోనూ బుమ్రా సత్తా చాటాడు. కేవలం 8 సగటుతో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనలతోనే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవల భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నాడు. కాగా బుమ్రా రికవరీ చూస్తుంటే ముంబై ఇండియన్స్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఐపీఎల్ 18వ సీజన్ లో మార్చి 24న చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అప్పటివరకల్లా తమ మ్యాచ్ విన్నర్ కోలుకుంటాడని ముంబై యాజమాన్యం భావిస్తోంది. ఇక బుమ్రా తిరిగి రావడం ముంబైకి చాలా ప్లస్ పాయింట్.. ఇప్పటికే 5 సార్లు చాంపియన్ గా నిలిచిన ముంబై గత ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ మెగావేలానికి ముందు రోహిత్, సూర్యకుమార్, హార్థిక్ , బుమ్రా , తిలక్ వర్మలను రిటైన్ చేసుకుంది. వేలంలోనూ పలువురు స్టార్ ప్లేయర్స్ ను తీసుకున్న ముంబై ఆరోసారి టైటిల్ గెలిచేందుకు సిద్ధమవుతోంది.