Fans Abusals: బాబోయ్.. ఇది కూడా పాకిస్థాన్ కుట్రేనంటా! మన ఫ్యాన్స్ మహాత్మాగాంధీలటా!
యువ సంచలనం శుభమన్ గిల్ సెంచరీతో అదరగొట్టడంతో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు పోయింది. గిల్ సెంచరీ కొట్టకపోయి ఉంటే తామే ప్లేఆఫ్‌కు వెళ్లే వాళ్లమని సోషల్‌మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు.
Fans Abusals: క్రికెట్ అభిమానుల వెర్రి వేషాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. గంభీర్ భార్య, గిల్ సిస్టర్ టార్గెట్‌గా కోహ్లీ ఫ్యాన్స్ లిమిట్ దాటిన ఘటనలు మరవకముందే ధోనీ ఫ్యాన్స్ మోహిత్ శర్మ తల్లిని అబ్యూజ్ చేశారు. కారణం తెలిస్తే మీ బీపీ పెరిగే ఛాన్స్ ఉంది.. సో జాగ్రత్త..!
ప్రస్తుత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు అప్పుడెప్పుడో 1964లో చనిపోయిన దేశ తొలి ప్రధాని నెహ్రూనే కారణమని కాషాయ కార్యకర్తలు చెప్పుకున్నట్టు. క్రికెట్‌లో కోహ్లీ, ధోనీ ఫ్యాన్స్ వెర్రితనం వెనుక పాకిస్థాన్ ఉందని కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈసారి కూడా కప్ గెలవకుండానే ఐపీఎల్ నుంచి బెంగళూరు దుకాణం సర్ధుకుంది. గుజరాత్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. యువ సంచలనం శుభమన్ గిల్ సెంచరీతో అదరగొట్టడంతో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు పోయింది. గిల్ సెంచరీ కొట్టకపోయి ఉంటే తామే ప్లేఆఫ్‌కు వెళ్లే వాళ్లమని సోషల్‌మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగలేదు. గిల్ సిస్టర్ సోషల్‌మీడియా ఐడీలను షేర్ చేస్తూ ఆమెను దూషించారు. ట్రాన్స్‌జెండర్ అంటూ, ఐటెమ్ అంటూ.. గిల్ చచ్చిపోవాలంటూ కామెంట్స్ చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అవ్వడంతో దెబ్బకు ఐడీలు డిసేబుల్ చేసుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఆ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే ధోనీ ఫ్యాన్స్ ఖండకావరం బయటపడింది.
క్రికెట్‌లో బ్యాటర్ ఎవరైనా ఏదో ఒక బంతికి అవుట్ అవ్వడం కన్ఫామ్. బ్యాటర్‌ను అవుట్ చేయడం బౌలర్ల బాధ్యత. అదే పని చేసిన గుజరాత్ వెటరన్ బౌలర్ మోహిత్ శర్మను ధోనీ ఫ్యాన్స్ దారుణంగా కామెంట్లు పెట్టారు. బయటకు మాట్లాడలేని పదాలతో అతని తల్లిని దూషించారు. గుజరాత్‌పై మ్యాచ్‌లో ధోనీ కేవలం ఒక్క పరుగుకే అవుట్ అవ్వడంతో తట్టుకోలేకపోయిన కొందరి మహేంద్రుడి అభిమానులు మోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కింద బూతుల వర్షం కురిపించారు. ఇదంతా ట్రూ క్రికెట్ లవర్స్‌కు బాధ కలిగించింది. కొంతమంది అభిమానుల వల్ల మొత్తం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఇంతలోనే కొత్త ప్రచారం పుట్టుకొచ్చింది.
గిల్ సిస్టర్‌ను, మోహిత్ శర్మని దూషించిన వాళ్లు భారతీయులు కాదు అని.. ఇదంతా పాకిస్థాన్ వాట్సాప్ గ్రూప్‌ల్లో జరుగుతున్న కుట్ర అని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. గిల్ సిస్టర్‌ని, మోహిత్ తల్లిని అబ్యూజ్ చేసిన వాళ్ల ఐడీలు చాలా పాతవి. వాళ్లంతా ఎప్పటినుంచో కోహ్లీ, ధోనీ అభిమానులు. నిజానికి హార్డ్‌కోర్ ఫ్యాన్స్! చాలాఏళ్లుగా వారి ఐడీలు యాక్టివ్‌గా ఉన్నాయి.
పాకిస్థాన్ పనిగట్టుకొని గిల్ సెంచరీ కొడతాడని ఊహించి కొన్ని సంవత్సరాల క్రితమే ఐడీలు క్రియేట్ చేసుకొని ఉండదు కదా.. ఒకవేళ వాళ్లంతా ఫేక్ అయితే జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా ట్వీట్ చేసిన వెంటనే వాళ్ల అకౌంట్లను ఎందుకు డిసేబుల్ చేసుకున్నట్టు..? భయంతోనే కదా..? మన బురద మనం కడుక్కోకుండా పరాయి వాళ్లపై నిందమోపే ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి నిజమూ లేదు. ఇకనైనా కొంతమంది క్రికెట్ అభిమానులు తమ తీరు మార్చుకుంటే మంచిది. సినీ హీరోల అభిమానుల లాగా ప్రవర్తిస్తే అది మొత్తం టీమిండియా ఫ్యాన్స్‌కు చెడ్డపేరు తీసుకొస్తుంది.