టాప్ లో గుజరాత్, అట్టడుగున హైదరాబాద్

ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ సారి ఊహించని జట్లే ప్లే ఆఫ్ చేరేలే కనిపిస్తున్నాయి. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లే టైటిల్ రేసులో దూసుకెళుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ టీమ్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 07:16 PMLast Updated on: Apr 12, 2025 | 7:16 PM

Gujarat At The Top Hyderabad At The Bottom

ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ సారి ఊహించని జట్లే ప్లే ఆఫ్ చేరేలే కనిపిస్తున్నాయి. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లే టైటిల్ రేసులో దూసుకెళుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ టీమ్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో కింది నుంచి మొదటి రెండు స్థానాల కోసం పోటీ పడుతోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. 6 మ్యాచ్ లాడిన సీఎస్కే అయిదు ఓడింది. ఓ మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్ లో ఉంది. -1.554 నెట్ రన్ రేట్ తో ఆ టీమ్ వెనుకబడింది.

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కనీసం 7 మ్యాచ్ లు గెలవాలి. 14 పాయింట్లు సాధించాలి. ప్రతి టీమ్ 14 మ్యాచ్ లు ఆడుతుంది. సీఎస్కే ఇప్పటికే 6 మ్యాచ్ లాడింది. కానీ ఒకటే గెలిచింది. అంటే ఆ టీమ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే మిగతా 8 మ్యాచ్ ల్లో తప్పనిసరిగా 6 అయితే గెలవాలి. కానీ ప్రస్తుతం ఆ టీమ్ ఫామ్ చూస్తే అది కష్టమే అనిపిస్తోంది. ఈ సీజన్ లో సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలను ఫ్యాన్స్ వదులుకోవాల్సిందేనని పలువురు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పాయింట్ల టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆ టీమ్ 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. 4 ఓడింది. -1.629 నెట్ రన్ రేట్ తో ఉన్న ఆ టీమ్ ఇంకా 9 మ్యాచ్ లు ఆడనుంది. మరి వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్ రేసులో నిలుస్తుందేమో చూడాలి.

ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేస్ లో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతోంది. ఆ టీమ్ 5 మ్యాచ్ ల్లో4 గెలిచింది. 8 పాయింట్లు సాధించింది. 1.413 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అసలు ఓటమన్నదే లేదు. ఆ టీమ్ ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. అయితే నెట్ రన్ రేట్ లో గుజరాత్ కంటే వెనుకబడింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ , ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మూడేసి విజయాల చొప్పున సాధించాయి. ఈ నాలుగు టీమ్స్ ఆరు పాయింట్లతో ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ లో తేడా కారణంగా కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ ల్లో రెండు గెలిచింది. ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. ముంబయి ఇండియన్స్ కూడా ప్లేఆఫ్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్ లోనూ గెలవడమే కాదు రన్ రేట్ సైతం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నప్పటకీ రన్ రేట్ కారణంగా కోల్ కత్తా ముందంజ వేసింది. సో ఇకపై జరిగే మ్యాచ్ లలో విజయాలే కాదు ప్రతీ జట్టుకూ రన్ రేట్ కూడా చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడు స్థానాల్లో ఉన్న చెన్నై, ముంబై, హైదరాబాద్ జట్లు ఇప్పుడు రన్ రేట్ పైనా ఫోకస్ పెట్టాల్సిందే.