Gujrat Titans: విలియంసన్ మాకొద్దు రేసుగుర్రాలే కావాలి టైటాన్స్ 2024 స్ట్రాటజీ
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న గుజరాత్ టైటాన్స్ అప్‌కమింగ్ సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో అప్‌కమింగ్ సీజన్‌కు సంబంధించిన వేలం జరగనుండగా.. గుజరాత్ టైటాన్స్ తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది.
ఇప్పటికే అవసరం లేని ఆటగాళ్లతో ఓ జాబితాను రూపొందించింది. వారి ప్రదర్శనను నిశితంగా పరిశీలించడంతో పాటు జట్టు బలహీనతలను అధిగమించేందుకు కావాల్సిన ఆటగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గుజరాత్ టైటాన్స్ విడుదల చేసే ఆటగాళ్లలో ముగ్గురు ఫారిన్ ప్లేయర్లు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో బరిలో దిగిన అతను.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో బ్యాటింగ్ కూడా చేయకుండానే జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత కారణంగా గత 4 నెలలుగా ఇంటికే పరిమితమైన అతను న్యూజిలాండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానంగానే మారింది.
ఈ క్రమంలోనే అతన్ని వదులుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. ఇక వేలంలో మంచి ధరకు ఒడియన్ స్మిత్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. కానీ అతన్ని ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా ఆడించలేదు. బ్యాకప్ ప్లేయర్‌గా అతన్ని జట్టులోకి తీసుకొంది. అయితే ఇతర లీగ్‌ల్లో అతని పెర్ఫామెన్స్ ఏ మాత్రం బాలేదు. ఈ క్రమంలో అతన్ని రిలీజ్ చేయాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన మాథ్యూ వేడ్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.
2021 టీ20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన మాథ్యూ వేడ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయడంతో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. తాజా సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా అతను ఆడలేదు. ఈ క్రమంలోనే మాథ్యూ వేడ్‌ను వదులుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది.