మెగాటోర్నీకి బుమ్రా దూరం రీప్లేస్ మెంట్ గా హర్షిత్ రాణా
అందరూ భయపడినట్టే జరిగింది... ఊహించినట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగాటోర్నీకి దూరమయ్యాడు.

అందరూ భయపడినట్టే జరిగింది… ఊహించినట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగాటోర్నీకి దూరమయ్యాడు. వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుమ్రాను తప్పించింది. అతని స్థానంలో హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక చేసింది. నిజానికి ఆస్ట్రేలియా టూర్ లోనే బుమ్రా గాయపడ్డాడు. సిడ్నీ టెస్ట్ మధ్యలోనే తప్పుకున్నాడు. అయితే గాయపడిన బుమ్రాకు మొదట ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటిచ్చారు. నిర్ణీత గడువులోగా అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని నిర్ణయించారు. అతడు పూర్తిగా ఫిట్ నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలోని మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రత్యేక డాక్టర్ కూడా బుమ్రా కోలుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం బుమ్రా గాయం నుంచి దాదాపు కోలుకున్నట్లే అని తెలిపిన మెడికల్ టీమ్.. ఎటువంటి ఇబ్బందీ లేకుండా మాత్రం బౌలింగ్ చేస్తాడన్న హామీని ఇవ్వలేకపోయిందని తెలుస్తోంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని సెలక్షన్ కమిటీ భవిష్యత్ పర్యటనల దృష్ట్యా బుమ్రాకు ఇంకొంత కాలం విశ్రాంతినిచ్చారు. ఒక దశలో బుమ్రా ఆడటానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా.. నాకౌట్ మ్యాచ్‌ల వరకు ఎదురుచూడాలని బీసీసీఐ భావించింది. కానీ ఇది టీమిండియాకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దాదాపు నెల రోజులుగా బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడని, అతన్ని నేరుగా నాకౌట్ మ్యాచ్‌లు ఆడిస్తే రిథమ్‌లో బౌలింగ్ చేయడం కష్టమని సూచిస్తున్నారు. పైగా అతని ఫ్యూచర్ ను కూడా రిస్క్ లో పెట్టినట్టేనని బీసీసీఐ సెలక్టర్లు భావించినట్టు సమాచారం.
దీంతో ఈ స్టార్ పేసర్ ను స్క్వాడ్ నుంచి తప్పించి బుమ్రా ప్లేస్‌లో సెలెక్షన్ కమిటీ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది. అలాగే, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలోవరుణ్ చక్రవర్తీకి చోటు దక్కింది. అతని కోసం ఓపెనర్ జైశ్వాల్ ను 15 మంది జాబితా నుంచి తప్పించింది. ఇటీవల ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో వరుణ్ అదరగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే జైశ్వాల్ , మహ్మద్ సిరాజ్, శివం దూబేను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా ప్రకటించింది. జట్టుకు అవసరమైతే ఈ ముగ్గురూ దుబాయ్ వెళ్తారని బీసీసీఐ తెలిపింది.