ఇవే తగ్గించుకుంటే మంచిది… హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ సీన్ రిపీట్
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ సీన్ అభిమానులు మరిచిపోలేరు.
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ సీన్ అభిమానులు మరిచిపోలేరు. సన్ రైజర్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసిన ఆనందంలో అతని వైపు చూస్తు రాణా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ చర్యకు అతనిపై నిషేధం కూడా విధించారు. అయితే మరోసారి ఇదే సీన్ ను హర్షిత్ రాణా దులీప్ ట్రోఫీలో రిపీట్ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్ లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇండియా సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను ఔట్ చేసిన హర్షిత్ రాణా.. అతనికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రెచ్చగొట్టాడు. తర్వాత
మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ఔట్ చేసినప్పుడు గాల్లోకి పంచ్‌లు ఇస్తూ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అయితే హర్షిత్ రాణా బౌలింగ్ ప్రద్శనను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. అతని ప్రవర్తనను మాత్రం తప్పుబడుతున్నారు.
ఫ్లయింగ్ కిస్ సీన్ విషయంలో ఒకసారి నిషేధం పడినా తీరు మార్చుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇండియా టీమ్ కు ఆడే సత్తా ఉందని, అదే సమయంలో క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లు ఔటైనప్పుడు రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకోవడం సరికాదని, క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలని హర్షిత్ రాణాకు సూచిస్తున్నారు.బౌలింగ్‌పై ఫోకస్ చేయాలని.. ఇతర విషయాలను తగ్గించుకుంటే అతని కెరీర్‌కే మంచిదంటున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ఫ్లయింగ్ కిస్ సీన్ ను సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ ఈ సారి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో చూడాలి.