వేలంలో అతనికే భారీధర బంగర్ చెప్పిన ప్లేయర్ ఎవరంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఈ సారి అన్ని జట్ల రూపురేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేలంలో ఎవరికి భారీ ధర పలుకుతుందనే దానిపై చర్చ మొదలైంది. తాజాగా భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి వచ్చినప్పటకీ ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక ధర పలుకుతాడని జోస్యం చెప్పాడు. కెప్టెన్సీతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌పై కనక వర్షం కురుస్తుందని చెప్పాడు. ఫ్రాంచైజీ పర్స్ మనీపైనే ఈ భారీ ధర ఆధారపడి ఉంటుందన్నాడు. రోహిత్ ను తాము దక్కించుకోవడం అనుమానమేనని బంగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ పర్స్ లో ఉన్న డబ్బులతో అతన్ని కొనుగోలు చేయడం కష్టమేనన్నాడు.
బంగర్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే రోహిత్ ఈ సారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ఓపెనర్ గానూ రికార్డులు సృష్టించాడు. గత సీజన్ లో ముంబై రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారథ్యబాధ్యతలు అప్పగించింది. దీంతో ఫ్రాంచైజీ తీరుపై అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వేలంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అటు ముంబై కూడా రోహిత్ ను రిటైన్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాగా రోహిత్ వేలంలోకి వస్తే లక్నో, ఢిల్లీ కూడా కొనేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.