ఆర్సీబీ ఫ్యూచర్ అతడే, రజత్ ను సపోర్ట్ చేయమన్న కోహ్లీ
ఐపీఎల్ 18వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అవుతోంది. మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది..

ఐపీఎల్ 18వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అవుతోంది. మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.. అందుకే వారిని ఎంటర్ టైన్ చేసేందుకు ప్రతీ ఏడాది అన్ బాక్స్ ఈవెంట్ నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ సీజన్ ముంగిట కూడా అన్ బాక్స్ ఈవెంట్ నిర్వహించగా.. ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఉద్దేశించిన ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ పై ప్రశంసలు కురిపిస్తూ కోహ్లీ మాట్లాడాడు. రజత్ పటీదార్ చాలా కాలం పాటు జట్టును నడిపిస్తాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి దశాబ్దానికిపైగా ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించాడు. అతని తర్వాత డుప్లెసిస్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరడంతో కొత్తగా యంగ్‌స్టర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఈ నేపథ్యంలో పటిదార్ ను ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని విరాట్ కోరాడు.
అతను గొప్ప పని చేయబోతున్నాడనీ, అతనిలో విజయానికి అవసరమైన ప్రతీ లక్షణం ఉందంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో ఈ సారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొత్త సీజన్‌ను ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు. రజత్ పటిదార్ టాలెంట్ గురించి కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడో అద్భుతమని ప్రశంసించాడు. చాలా టాలెంటెడ్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. సాధారణంగా విరాట్ అంత ఈజీగా ఎవర్నీ పొగడడు. అవతలి ఆటగాళ్లలోని నైపుణ్యం, క్రమశిక్షణ, పట్టుదలను చూసే కామెంట్స్ చేస్తుంటాడు. అలాంటిది ఓ యంగ్ బ్యాటర్‌ను ఈ రేంజ్‌లో మెచ్చుకోవడం అంటే సమ్‌థింగ్ స్పెషలే.
ప్రస్తుతం రజత్ భుజాలపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ టీమ్‌ను విజయవంతంగా నడిపించడమే గాక అభిమానుల నమ్మకాన్ని కూడా నిలబెట్టే బాధ్యత రజత్ భుజాల మీద ఉందన్నాడు . ఈ ఫ్రాంచైజీ తన మీద పెట్టుకున్న ఆశల్ని అతడు తప్పక నెరవేరుస్తాడనే విశ్వాసం తనకు ఉందన్నాడు. సారథిగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, ప్రతిభ అతడిలో మెండుగా ఉన్నాయని కోహ్లీ చెప్పుకొచ్చాడు.ఇదిలా ఉంటే అన్ బాక్స్ ఈవెంట్ లో రజత్ కూడా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు.
ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.
విరాట్‌తో పాటు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి లెజెండ్స్ ఈ టీమ్‌కు ఆడారనీ, అలాంటి గొప్ప టీమ్ కు ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉందన్నాడు. కాగా కోహ్లీ కెప్టెన్సీ ఆసక్తి చూపించకపోవడంతో ఆర్సీబీ మేనేజ్ మెంట్ రజత్ పటిదార్ ను సారథిగా ఎంపిక చేసింది. జట్టులో పలువురు సీనియర్లు ఉన్నప్పటకీ అతనికే పగ్గాలు అప్పగించింది. 2021లో కనీస ధర 20 లక్షలకూ అమ్ముడుపోని రజత్ పటిదార్, ఇప్పుడు ఏకంగా 11 కోట్లకు రిటైన్ అవ్వడం అతని టాలెంట్ కు నిదర్శనంగా చెప్పొచ్చు. గత సీజన్ లో పలు మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టిన పటిదార్ తన కెప్టెన్సీ మార్క్ తో బెంగళూరుకు టైటిల్ అందిస్తాడేమో చూడాలి.