రెండు చేతులతో బౌలింగ్ ఐపీఎల్ కోసం హనీమూన్ వాయిదా…!

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాల బాట వీడలేదు. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 06:50 PMLast Updated on: Apr 04, 2025 | 6:50 PM

Honeymoon Postponed For Ipl Bowling With Both Hands

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాల బాట వీడలేదు. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బౌలర్ల పేలవ ప్రదర్శన.. తర్వాత బ్యాటర్ల వైఫల్యంతో సన్ రైజర్స్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ ఓడినా అతని బౌలింగ్ ప్రత్యేకంగా నిలిచింది. కమిందు మెండిస్‌కు తొలిసారి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది.ఈ ఆటగాడిని ఐపీఎల్ 2025 మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లోనే కమిందు మెండిస్ ఇప్పటివరకు ఐపీఎల్ లో చూడని అద్భుతాన్ని చేశాడు. ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీలు ఇద్దరు క్రీజులో ఉన్నారు. కమిందు మెండిస్ ఈ ఇద్దరు బ్యాటర్లకు వేర్వేరు చేతులతో బౌలింగ్ వేశాడు. వెంకటేష్ అయ్యర్ ఎడమ చేతి వాటం బ్యాటర్ కాబట్టి మెండిస్ తన కుడి చేతితో అతనికి బౌలింగ్ చేశాడు. మరోవైరు రఘువంశీ కుడిచేతి వాటం బ్యాటర్ కాబట్టి మెండిస్ తన ఎడమ చేతితో అతనికి బౌలింగ్ చేశాడు. మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘనత ఎవరూ సాధించలేదు. జోరుమీదున్న ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్స్‌ను త‌న బౌలింగ్‌తో మెండిస్ క‌న్ఫ్యూజ్ చేశాడు. ఆ క‌న్ఫ్యూజ‌న్‌లోనే మెండిస్ బౌలింగ్‌లో ర‌ఘువంశీ ఔట‌య్యాడు. మెండిస్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో మెండిస్‌ ఒక ఓవర్ వేసి 4 పరుగులే ఇచ్చి వికెట్ తీసినా… కెప్టెన్ కమ్మిన్స్ అతనికి మళ్ళీ బౌలింగ్ ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉంటే ఐపీఎల్ ఆడడం కోసం కమిందు తన హనీమూన్ ట్రిప్ కూడా వాయిదా వేసుకున్నాడు. ఇటీవలే తన ప్రియురాలు నిష్నిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట ళ్లికి ప‌లువురు శ్రీలంక క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్ కోసం భార్య‌తో క‌లిసి ఫారిన్ వెళ్లాల‌ని క‌మిందు మెండిస్‌ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. కానీ ఐపీఎల్ షెడ్యూల్ ఖ‌రారు కావ‌డంతో హ‌నీమూన్‌ను వాయిదా వేసుకొని మ‌రి ఐపీఎల్ ఆడుతోన్నాడు.ఈ సీజ‌న్‌తోనే మెండిస్ ఐపీఎల్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌మిందు మెండిస్ శ్రీలంక త‌ర‌ఫున 19 వ‌న్డేలు, 12 టెస్ట్‌లు ఆడాడు. 23 టీ20ల‌లో ప్రాతినిథ్యం వ‌హించాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 , రఘువంశీ 50 పరుగులు చేశారు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకు ఆలౌటైంది. కోల్ కత్తా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో 3 వికెట్లు పడగొట్టారు.