WTC final: ఈ ఇద్దరి వల్లే టీమిండియా ఓడిపోయింది..! ఇది మారకుంటే వరల్డ్ కప్ కూడా అస్సామే!
ఓడిపోయాం..ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో చెత్తగా ఆడి ఇంటిముఖం పట్టాం! ఓటమికి కారణం ఎవరన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి కానీ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసి పరాజయానికి కారణం అవుతున్నది మాత్రం ఈ ఇద్దరే..!

Rahul Dravid and Rohith Sharma Did mistake to lost the wtc match
తలా తోక లేని నిర్ణయాలు.. అర్థంపర్థం లేని స్ట్రాటజీలు.. అంతుబట్టని గేమ్ ప్లాన్.. ఇది టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు..! ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ గురించి కాదు.. ఎప్పుడైతే ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి అంతే ఉంది. మధ్యలో కెప్టెన్‌గా ఎన్నికైన రోహిత్ శర్మ ద్రవిడ్ నిర్ణయాలను సమర్ధిస్తున్నాడో.. వ్యతిరేకిస్తున్నాడో తెలియదు కానీ.. కోచ్ చెప్పిందే ఫాలో అవుతున్నాడు. టీమ్ తుది కూర్పు పెత్తనమంతా ద్రవిడ్‌దే అంటారు. మరి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎందుకు ఉన్నట్టు? కోచ్, బీసీసీఐ ఏం చెబితే దానికి తలాడించడానికే రోహిత్ ఉన్నాడా..? టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ పాత్ర శూన్యమా? ఏదో ఐపీఎల్‌లో ఐదు కప్పులు కొట్టాడని.. కోహ్లీని పక్కన పెట్టి రోహిత్‌ని కెప్టెన్ చేశారు. తీరా రోహిత్ ఉద్ధరిస్తున్నదేమీ లేదు.
గత ప్రపంచ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ టీమిండియా ఫైనల్ వరకు వచ్చింది.. న్యూజిల్యాండ్‌పై ఓడిపోయింది.. అప్పుడు కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు.. ఈ సారి రోహిత్ ఉన్నాడు.. ఫలితం మాత్రం మారలేదు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ లయన్ చెలరేగిపోయాడు. కీలక వికెట్లు పడగొట్టాడు. మనం మాత్రం అశ్విన్ లేకుండా ఉమేశ్ యాదవ్‌తో బరిలోకి దిగాం. కేవలం జడేజా తప్ప మరో స్పిన్నర్ లేడు. అశ్విన్ స్పెషలిస్ట్ స్పిన్నర్. ఈ ఒక్క నిర్ణయంతోనే ఇండియా ఓటమికి దారులు తెరుచుకున్నాయని అటు ఆస్ట్రేలియా, టీమిండియా మాజీ ఆటగాళ్లతో పాటు విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు క్రికెట్‌పై ఈ ఇద్దరికి కనీస జ్ఞానం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శ తప్పే కావొచ్చు. 160కి పైగా టెస్టులు ఆడిన ద్రవిడ్ పరిజ్ఙానం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు.. కానీ కోచ్‌గా ద్రవిడ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిసారి బెడిసికొడుతున్నాయి. ఈ విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.
ఐపీఎల్ ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. రాహుల్ కీపర్ కూడా. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఎంపిక చేశారు.. సర్ఫరాజ్ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడినా ద్రవిడ్, రోహిత్‌తో చర్చలు తర్వాత ఇషాన్ కిషాన్‌ని ఎంపిక చేశారు. పోని ఇషాన్‌ని ఆడించారా అంటే అదీ లేదు. కేవలం కీపర్‌గానే సత్తా చాటుతున్న భరత్‌ని తుది జట్టుకు ఎంపిక చేశారు. గతంలో వచ్చిన ఛాన్స్‌లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ భరత్ ఫ్లాప్ అయ్యాడు. అలాంటి ఆటగాడు క్రికెట్‌లో అత్యుత్తమైన ఫార్మెట్‌గా కీర్తించే టెస్టులో ఛాన్స్ దక్కించుకోవడం విడ్డూరమే..ఇక అది కూడా ఫైనల్‌లో..! ఊహించినట్టే భరత్ ఫెయిల్ అయ్యాడు. కీపర్‌గా మంచి మార్కులే కొట్టేసినా బ్యాటర్‌గా రాణించలేకపోయాడు. భరత్ స్థానంలో ఇషాన్‌ని ఆడించి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయాలు వినిపస్తున్నాయి. అటు ద్రవిడ్, రోహిత్ తమ తీరు మార్చుకోకుంటే ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.