Uppal Match: వీళ్ళు దుమ్ములేపితే వార్ వన్ సైడ్
రాజస్థాన్ రాయల్స్ వంటి జట్టును ఓడించాలంటే, సన్ రైజర్స్ తన శక్తినంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తమ మొదటి మ్యాచులో రాయల్స్ తో తలపడనున్న ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు.
అందులో మొదటి ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. స్వింగ్ కు సంబంధించిన పుస్తకం రాసేంత స్పెషలిస్ట్ మన భువి. కొత్త బంతితో భువి రాబట్టే స్వింగ్ ను రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ ముందుగానే పసిగట్టాలి. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్పదు. మొదటి ఓవర్లోనే వికెట్ తీసే చెడ్డ అలవాటు, అపోజిషన్ జట్టుకు ఆందోళన కలిగించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు భువి మొదటి ఓవర్లోనే తాను ప్రాతినిధ్యం వహించిన జట్లకు ఆరు సార్లు ఫస్ట్ బ్రేక్ అందించాడు.
రాయల్స్ ఓ కంట కనిపెట్టుకోవాల్సిన ఆటగాడు హ్యారీ బ్రూక్. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ మొదటి సారి ఐ పి ఎల్ లో ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్ ను వన్ డే ఫార్మాట్ లో ఆడే ఈ విధ్వంసక ప్లేయర్, ఆరెంజ్ తరపున ఆరెంజ్ క్యాప్ బరిలో నిలబడబోతున్నాడు. కొంచం గ్యాప్ దొరికినా, హ్యారీ చేతివాటంతో వార్ వన్ సైడ్ అయిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ కట్టడి చేయాల్సిన మూడో ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. స్పీడ్ కు పర్యాయ పదంగా మారిన ఉమ్రాన్ వేగానికి రాయల్స్ నెమ్మదించడం నేర్చుకోవాలి. లేదంటే, బ్యాట్స్ మెన్ వెనక్కి తిరిగి చూసే వరకు వికెట్లు గాల్లో ఎగురుతుంటాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు, నటరాజన్, రాహుల్ త్రిపాఠిలు కూడా తమ మార్క్ ప్రదర్శనను చూపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి.